Schemes : రేపు తెలంగాణలో 4 పథకాలు ప్రారంభం..
4 పథకాలు ప్రారంభించాక.. వెంటనే జిల్లాల పర్యటనలు మొదలవుతాయి. ఎక్కడికక్కడ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలూ, అధికారులూ జిల్లాల్లో పర్యటిస్తూ లబ్దిదారులకు నాలుగు పథకాల ప్రయోజనాలను స్వయంగా అందిస్తారు.
- Author : Latha Suma
Date : 25-01-2025 - 2:05 IST
Published By : Hashtagu Telugu Desk
Schemes : తెలంగాణలో రేపు 4 పథకాలు ప్రారంభం కానున్నాయి. రేపు అంటే ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టునున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మినహా మండలానికి ఒక అధికారిని ఎంపిక చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కాగా, ఈ 4 పథకాలకు సంబంధించి లబ్దిదారుల జాబితాలు రెడీ అయ్యాయి. 16,348 గ్రామ సభల్లో లబ్దిదారుల పేర్లను అధికారులు చదివి వినిపించారు. అలాగే.. పేర్లు లేని వారి పేర్లను జాబితాలో చేర్చారు. ఈరోజు ఈ జాబితాలను కంప్యూటర్లలో డేటా ఎంట్రీ చేస్తున్నారు. నేటి సాయంత్రం కల్లా అంతా అయిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి.. 4 పథకాలు ప్రారంభించాక.. వెంటనే జిల్లాల పర్యటనలు మొదలవుతాయి. ఎక్కడికక్కడ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలూ, అధికారులూ జిల్లాల్లో పర్యటిస్తూ లబ్దిదారులకు నాలుగు పథకాల ప్రయోజనాలను స్వయంగా అందిస్తారు. సీఎం హైదరాబాద్ దగ్గరోని ఏదైనా గ్రామానికి వెళ్లడం లేదా.. తన జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్లే ఛాన్స్ ఉంది.
ఇకపోతే పథకాలు వివరాలు.. రైతు భరోసా కింద.. వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్న రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూ.12,000 చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. అలాగే భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి రూ.12,000 ఇవ్వబోతోంది. ఇందులో తొలి విడతగా జనవరి 26న రూ.6,000 చొప్పున ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇళ్ల స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5,00,000 చొప్పున ప్రభుత్వం 4 విడతల్లో నగదు ఇస్తుంది. ఇలా తొలి దశలో ఈ పథకంలో భాగంగా.. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మాణానికి మనీ ఇవ్వనుంది. ఇక 40 లక్షల మందికి లబ్ది చేకూరేలా.. కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతోంది.