తెలంగాణ RTC సంక్రాంతికి స్పెషల్ బస్సులు
- Author : Vamsi Chowdary Korata
Date : 06-01-2026 - 11:40 IST
Published By : Hashtagu Telugu Desk
TGSRTC సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు 5,500 పైగా స్పెషల్ బస్సులు నడపనుంది. జనవరి 9 నుంచి ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ కోసం కూడా ఎక్కువ సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, బీహెచ్‌ఈఎల్ ప్రాంతం నుంచి కూడా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆర్సీపురం డిపో నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు స్పెషల్ బస్సులు నడుపుతోంది.
- సంక్రాంతి ప్రయాణానికి టెన్షన్ లేదు
- టీజీఎస్ ఆర్టీసీ 5,500 పైగా స్పెషల్ బస్సులు
- జనవరి 9 నుంచి ప్రత్యేక సర్వీసులు ప్రారంభం!
తెలుగు వారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు.. పండగ పూట సొంతూళ్లలో సంతోషంగా గడపాలని భావిస్తారు. అందుకోసం వ్యయప్రయాసాలకోర్చి సంక్రాంతికి ఊరికి వెళ్లాలనుకుంటారు. అయితే సంక్రాంతి సమయంలో రైళ్లలో టికెట్లు దొరకడం కష్టంగా ఉంటుంది. ఇక ప్రైవేటు ట్రావెల్స్ యజమాన్యాల దోపిడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండుగ సమయంలో రద్దీని అదనుగా చేసుకుని ఛార్జీలతో నిలువు దోపిడీ చేస్తారు. ఈ నేపథ్యంలో పండుగకు సొంతూరుకు వెళ్లే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం స్పెషల్ బస్సులు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు కూడా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు 5,500 పైగా స్పెషల్ బస్సులు నడిపేలా తెలంగాణ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలోని జిల్లాలకు మూడురోజుల్లో 2,500కు పైగా బస్సులు నడపనున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 3 వేల వరకు స్పెషల్ బస్సులు నడిపేలా టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో సంక్రాంతి స్పెషల్ బస్సుల వివరాలు ప్రకటిస్తామని తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జనవరి 9 (శుక్రవారం) నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపేలా ఆర్టీసీ బస్సులు సిద్ధం చేస్తోంది. కాగా, ముందుగా రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా.. పెద్దసంఖ్యలో బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
బీహెచ్‌ఈఎల్ నుంచి ప్రత్యేక బస్సులు..
హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ఆర్సీపురం డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఆర్సీపురం నుంచి మియాపూర్, కేపీహెచ్‌బీ, ఔటర్ రింగ్ రోడ్ మీదుగా.. ఏపీలోని అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రి, పోలవరం, గుంటూరు, చీరాల, విజయవాడతోపాటు తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఈ మేరకు బీహెచ్‌ఈఎల్ డిపో మేనేజర్ సుధా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈ తేదీల్లోనే..
కాగా, ఆర్సీపురం డిపో నుంచి నడిచే సంక్రాంతి ప్రత్యేక బస్సులు.. జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయని డిపో మేనేజర్ సుధా చెప్పారు. ఈ బస్సుల కోసం ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు. అందుకోసం ఆర్టీసీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలని చెప్పారు. ఈ స్పెషల్ బస్సులకు సంబంధించి ఇతర సమాచారం కోసం 9959226149 నెంబరుకు కాల్ చేయాలని వెల్లడించారు. అయితే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని డిపో మేనేజర్ సుధా తెలిపారు.