BC Caste Enumeration : బీసీ కులగణన చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం
BC Caste Enumeration : బీఆర్ఎస్ (BRS) సహా ఇతర ప్రతిపక్షాలు ఇందులో తప్పుడు లెక్కలు ఉన్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి
- By Sudheer Published Date - 09:55 PM, Mon - 3 February 25

తెలంగాణలో రాజకీయాలు బీసీ కులగణన (BC Caste Enumeration) అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఈ గణనను అసెంబ్లీలో ఆమోదించేందుకు సిద్ధంగా ఉండగా, బీఆర్ఎస్ (BRS) సహా ఇతర ప్రతిపక్షాలు ఇందులో తప్పుడు లెక్కలు ఉన్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. బీసీ జనాభా 46 శాతమేనని ప్రభుత్వం ప్రకటించగా, వాస్తవంగా అది మరింత ఎక్కువగా ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ముఖ్యంగా ముస్లిం బీసీలను వేరుగా చూపించడం ద్వారా మొత్తం సంఖ్య తక్కువగా నమోదైనట్లు వారు ఆరోపిస్తున్నారు.
Anil Ravipudi : మెగాస్టార్ కోసం మళ్లీ రంగంలోకి భీమ్స్..?
గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సకల జనుల సర్వేలో బీసీ జనాభా అధికంగా నమోదైందని, ఇప్పుడు మాత్రం తక్కువగా చూపించడం ఏమిటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీ కవిత సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే, అధికారికంగా ఈ రెండు గణనల వివరాలను పూర్తిస్థాయిలో బయట పెట్టని విషయం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వం చేసిన సర్వే వివరాలు ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు.
విపక్షాలు ఎప్పుడూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తాయనే సంగతి తెలిసిందే. కానీ, కులగణన విషయంలో విపక్షాల ఆరోపణలు తీవ్రస్థాయికి చేరాయి. ప్రభుత్వ లెక్కలు తప్పుడు అని వారు అంటుండగా, కాంగ్రెస్ మాత్రం అసెంబ్లీలో అభ్యంతరాలు చెప్పాలని విపక్షాలను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వం అధికారిక గణన ప్రకారం ఆమోదం కోరుతున్నట్టు చెబుతోంది. రేపు 4వ తేదీన అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కులగణన నివేదికను అధికారికంగా ఆమోదించనున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెంచే అంశంగా మారింది.