Deputy CM Bhatti: సామాజిక విప్లవానికి తెలంగాణ ఆదర్శం: డిప్యూటీ సీఎం భట్టి
ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి కట్టుబడి పని చేస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వారికి గట్టిగా సమాధానం చెప్పాలంటే ప్రజలు ఈ ప్రజా ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడాలని ఆయన కోరారు.
- By Gopichand Published Date - 02:59 PM, Mon - 18 August 25

Deputy CM Bhatti: సామాజిక న్యాయం, విప్లవానికి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి (Deputy CM Bhatti) విక్రమార్క అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాలు దేశవ్యాప్తంగా సామాజిక మార్పునకు నాంది పలికాయని పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి పాపన్న విగ్రహం ఒక పునాది అని, ఆయన ఆశయాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రవ్యాప్తంగా కుల గణనను విజయవంతంగా చేపట్టిందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ గణన ఆధారంగా బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి గవర్నర్‌కు పంపినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చారిత్రాత్మక చర్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందని, కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా కుల గణన చేపట్టాల్సిన పరిస్థితిని తెలంగాణ సృష్టించిందని వివరించారు. ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి అనేక అడ్డంకులు వచ్చినా వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళామని, ఈ విషయాన్ని ప్రతి బహుజనుడు తమ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: Ramanthapur Incident : రామంతపూర్‌లో శోభాయాత్రలో విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
సమాజంలో ఏమీ లేని స్థితి నుంచే పాపన్న అన్ని కులాలను ఏకం చేసి తన లక్ష్యాన్ని సాధించారని డిప్యూటీ సీఎం కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు గుర్తుచేసేలా సచివాలయం ముందు భాగంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సెక్రటేరియట్ ఎదురుగా విగ్రహం కోసం స్థలం కేటాయించడం ఒక స్ఫూర్తిదాయకమైన చర్య అని, ఈ విగ్రహం సామాజిక న్యాయానికి, ధర్మానికి పునాదిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి కట్టుబడి పని చేస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వారికి గట్టిగా సమాధానం చెప్పాలంటే ప్రజలు ఈ ప్రజా ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడాలని ఆయన కోరారు. బహుజన బిడ్డలు భవిష్యత్తులో ఫలాలు పొందేందుకు సిద్ధంగా ఉండాలని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆయన ఉద్ఘాటించారు.