Polling Holidays : మరో 3 రోజులు సెలవులు.. ఎందుకంటే ?
Polling Holidays : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు రోజులను సెలవు దినాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
- By Pasha Published Date - 10:45 AM, Tue - 17 October 23

Polling Holidays : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు రోజులను సెలవు దినాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నవంబరు 30వ తేదీని(గురువారం) వేతనంతో కూడిన సెలవుదినంగా అనౌన్స్ చేసింది. ఇక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన సంస్థలు, ఆఫీసులకు నవంబరు 29న (బుధవారం) రోజు సైతం సెలవు ఉంటుందని వెల్లడించింది. ఇక డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరిగే సంస్థలు, ఆఫీసులకు కూడా హాలిడే ఉంటుందని తెలిపింది. ఈమేరకు రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులను పంపించారు.
We’re now on WhatsApp. Click to Join.
మరో నెలన్నర రోజులే టైం
ఇక తెలంగాణలో పోలింగ్‌కు మరో నెలన్నర రోజులే టైం మిగిలింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉంది. పోలింగ్ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్‌ల స్టోరేజీలను ను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ మరమ్మతులు, ఇతరత్రా పనుల కోసం రూ. 19.50 కోట్లను విడుదల చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రోజుకు సంబంధించిన వేతనాన్ని సర్కారు చెల్లిస్తుంది.
దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వారికి..
ఎన్నికల కమిషన్ తొలిసారిగా దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వారు బ్యాలెట్ పద్ధతిలో ఓటువేసేందుకు అవకాశం కల్పిస్తుంది. సాధారణ ఎన్నికలకు ఒకరోజు ముందు వీరు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో రహస్య ఓటు వేయొచ్చు. పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేయాలనుకునే దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వారు ముందస్తుగానే బీఎల్‌ఓలకు ఫామ్ 12డీ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతించాక దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వారు ఇంటి వద్దే రహస్య ఓటింగ్ పద్ధతిలో బ్యాలెట్ ఓటింగ్ (Polling Holidays) వినియోగించుకోవచ్చు.