CM Revanth Reddy: తెలంగాణ విద్యా విధానం దేశానికే మార్గదర్శకం: సీఎం రేవంత్ రెడ్డి
రాబోయే 25 ఏళ్లకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047లో విద్యా విధానానికి ప్రత్యేక అధ్యాయం ఉంటుందని వెల్లడించారు.
- By Gopichand Published Date - 05:58 PM, Wed - 17 September 25

CM Revanth Reddy: భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల కలయికతో రూపొందించబడిన తెలంగాణ విద్యా విధానం (TEP) భారతదేశానికే దిక్సూచిగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ, పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే ప్రధాన ఆయుధమని ఆయన పేర్కొన్నారు. బుధవారం సెక్రటేరియట్‌లో తెలంగాణ విద్యా విధానం నివేదిక రూపకల్పనపై జరిగిన సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
విద్యా వ్యవస్థలో సమూల మార్పులే మా లక్ష్యం
తెలంగాణలో విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. గతంలో ప్రభుత్వాలు భూ పంపిణీ, నిధుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టేవని, ఇప్పుడు అలాంటి వనరులు లేవన్నారు. అందుకే పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక శక్తివంతమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. విద్యకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించినందుకే నెహ్రూ వంటి నాయకులు ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు స్థాపించారని గుర్తుచేశారు.
ఉద్యోగాలు లేకపోవడానికి నైపుణ్యాల లోపమే కారణం
మనం సరళీకృత ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు పెరిగినా, దానికి తగ్గట్టుగా విద్యా ప్రమాణాలు పెరగలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా రాష్ట్రం నుండి బయటకు వస్తున్న లక్షలాది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో పది శాతం మందికి కూడా ఉద్యోగాలు రాకపోవడానికి తగినంత నైపుణ్యం లేకపోవడమే కారణమని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Also Read: Masood Azhar: ఢిల్లీ, ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి ఎవరంటే?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంపై సీఎం ఆందోళన
విద్యా రంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేటు పాఠశాలలు నర్సరీ స్థాయి నుంచే విద్యను ప్రారంభిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే మొదలవుతున్నాయని, ఇది కూడా విద్యార్థులు తగ్గడానికి ఒక కారణమని వివరించారు. తల్లిదండ్రులకు భరోసా కల్పించగలిగితే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి వారు వెనుకాడరని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు, ప్రమోషన్లు చేపట్టామని, విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించామని సీఎం తెలిపారు. డ్రగ్స్‌కు బానిసలవుతున్న యువత జీవితాలను రక్షించడానికి విద్యలో నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
‘విజన్ డాక్యుమెంట్-2047’లో విద్యా విధానానికి చోటు
రాబోయే 25 ఏళ్లకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047లో విద్యా విధానానికి ప్రత్యేక అధ్యాయం ఉంటుందని వెల్లడించారు. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక మరియు నైపుణ్య విద్యలుగా విభజించుకొని, ఉప-కమిటీలు ఏర్పాటు చేసి అత్యుత్తమ నివేదికను రూపొందించాలని ఆయన విద్యావేత్తలను కోరారు. పేద, అణగారిన వర్గాలకు లబ్ధి చేకూరేలా విద్యా వ్యవస్థ ఉండాలని ఆకాంక్షించారు. కులాల ఆధారంగా విద్యార్థులను వేరుచేయడం కాకుండా, అందరికీ సమాన అవకాశాలు కల్పించి ‘అంతా ఒక్కటే’ అనే భావనను కలిగించాలని సూచించారు.
ఈ సమావేశంలో విద్యావేత్తలు తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు. తెలంగాణ విద్యా విధానం చైర్మన్ కేశవరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐ.వి. సుబ్బారావు, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బి.ఎస్. మూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన సేవలను విద్యా రంగానికి వాలంటీర్‌గా వినియోగించుకోవాలని కోరిన సుబ్బారావు, అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ప్రభుత్వం చేపట్టిన కృషిని అభినందించారు.