CM Cup : డిసెంబరు 7 నుంచి జనవరి 2 వరకు ‘సీఎం కప్’ క్రీడోత్సవాలు
రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 7 నుంచి జనవరి 2 వరకు 36 ఈవెంట్స్(CM Cup)లో ఈ క్రీడోత్సవాలను నిర్వహించనున్నారు.
- By Pasha Published Date - 03:25 PM, Mon - 2 December 24

CM Cup : తెలంగాణలోని క్రీడా ప్రియులు, యువత, విద్యార్థి లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సీఎం కప్ -2024’ క్రీడోత్సవాలపై కీలక ప్రకటన వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 7 నుంచి జనవరి 2 వరకు 36 ఈవెంట్స్(CM Cup)లో ఈ క్రీడోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా డిసెంబరు 7,8 తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతాయి. వీటిలో పాల్గొనేందుకు ఆసక్తి, అర్హతలు కలిగిన వారు డిసెంబరు 4వ తేదీ నుంచి cmcup2024.telangana.gov.in అనే వెబ్‌సైటులో పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో అభ్యర్థులు తమ ఫోన్ నంబరు, ఇతర వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు వంటి వివరాలన్నీ సమర్పించాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక.. సీఎం కప్ అధికారిక వెబ్‌సైటులో ఉన్న ‘డౌన్ లోడ్ అక్నాలెడ్జ్‌మెంట్’ సెక్షన్‌లోకి వెళ్లి అక్నాలెడ్జ్‌మెంట్ ప్రతిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాన్ని మన ఫోనులో సేవ్ చేసుకోవచ్చు. లేదంటే ప్రింటవుట్ కూడా తీసుకోవచ్చు. ఈ క్రీడా పోటీల్లో చివరగా రాష్ట్ర స్థాయిలో ఎంపికయ్యే వారికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం కోచింగ్ ఇప్పిస్తుంది. ఆయా క్రీడా విభాగాల్లోని నిపుణులతో వారికి ప్రత్యేక శిక్షణ అందే ఏర్పాట్లు చేస్తుంది. వసతి, శిక్షణకు అయ్యే అన్ని ఖర్చులనూ రాష్ట్ర సర్కారే భరిస్తుంది.
Also Read :Cake Offerings Ban : ఇన్‌ఫ్లూయెన్సర్ ఓవర్ యాక్షన్.. ఆ ఆలయంలో బర్త్‌డే కేక్ నైవేద్యాలపై బ్యాన్
సీఎం కప్‌లోని 36 ఈవెంట్స్ ఇవే..
సీఎం కప్ క్రీడోత్సవాల్లో భాగంగా చేర్చిన 36 ఈవెంట్స్‌లో.. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, హాకీ, ఫుట్ బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, యోగా, సెపాక్ తక్రా, చెస్, బేస్ బాల్, నెట్ బాల్, కరాటే, కిక్ బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, స్క్వాష్, కనోయింగ్ అండ్ కయాకింగ్, వుషు, అత్యపత్య, పవర్ లిఫ్టింగ్, సాఫ్ట్ బాల్, తైక్వాండో, జూడో, బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఉన్నాయి.