Talasani Srinivas Yadav: ఉమ్మడి రాష్ట్రంగా కలిపే కుట్ర.. మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు..!
- By HashtagU Desk Published Date - 04:45 PM, Wed - 9 February 22

తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎంజీ రోగ్‌లో గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
అనంతరం బైక్ ర్యాలీగా బోట్స్ క్లబ్, ట్యాంక్ బండ్, బీఆర్‌కే భవన్, ఏజీ ఆఫీస్ మీదుగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వరకు చేరుకొన్నారు. ఆక్కడ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్, అలాగే ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాద్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ లతో కలిసి అమరవీరుల స్థూపాన్నిపాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన పై పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు అమరవీరుల త్యాగాలను కించ పరిచేలా ఉన్నాయని, బడ్జెట్ సమావేశాలలో భాగంగా రాష్ట్ర విభజనపై వ్యాఖ్యలు చేయడం అసంబద్ధమైనవని తలసాని యాదవ్ పేర్కొన్నారు.
ఇక కులాలు, మతాల మద్య చిచ్చుపెట్టి పాలన సాగించడం బీజేపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, కలసిమెలసి ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కూడా చిచ్చుపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మిషన్ భగీరధ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబందు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ గుజరాత్ కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని, దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ శ్రేణులు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. పూటకో డ్రెస్‌ను మార్చడంపై ఉన్న శ్రద్ధ దేశ ప్రజల అభివృద్ధి పై ప్రధానమంత్రికి లేదని మంత్రి తలసాని దుయ్యబట్టారు.
అలాగే లాభాలలో ఉన్న ఎల్ఐసీ, సింగరేణి వంటి ప్రధాన రంగాలను ప్రైవేట్‌కు దారాదత్తం చేస్తామని బహిరంగంగా సిగ్గులేకుండా చెపుతున్నారని, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి జోలికి వస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని తలసాని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అవుతుందని, రాష్ట్రం నుండి ఒక కేంద్రమంత్రి, ముగ్గురు ఎంపీలు ఉన్నారని, అయినా తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇచ్చారో, ఏం చేశారో బీజేపీ నేతలు ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సీయం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటే కుక్కల్లా మొరిగిన బీజేపీ నేతలు ప్రధాని వ్యాఖ్యలపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు . బీజేపీ నేతల బాష, వైఖరిని చూసి ప్రజలు అసహ్యించు కుంటున్నారని మంత్రి తలసారి పేర్కొన్నారు.
దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకోవాలని, వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని వినియోగించుకోవాలని, విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని ముఖ్యమంత్రి కేసీర్ కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తే దాని పై నోరు ఎందుకు మెదపరని ప్రశ్నించారు. స్థానిక బీజేపీ నేతలు నేతలు డిల్లీ వెళ్ళి ప్రధాని క్షమాపణలు చెప్పించాలని, లేదంటే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీజేపీ నేతలను అడ్డుకొని నిరసనలు తెలుపుతాయని హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌లు కొలన్ లక్ష్మీ, మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్‌లు అత్తిలి అరుణ గౌడ్, ఉప్పల తరుణి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరిక్రిష్ణ, కొలన్ బాల్ రెడ్డి, వెంకటేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.