Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి.. ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్
నైరుతి రుతు పవనాలు(Southwest Monsoon) ముందే వచ్చేయడం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల ఈ ఏడాది సాధారణం కంటే భారీ వర్షాలు పడనున్నాయి.
- By Pasha Published Date - 12:48 PM, Sat - 24 May 25

Southwest Monsoon : నైరుతి రుతుపవనాలు ఈరోజు (శనివారం) కేరళ తీరాన్ని తాకాయి. వాతావరణ నిపుణులు అంచనా వేసిన సమయం కంటే ఎనిమిది రోజులు ముందుగానే అవి భారత్‌కు చేరుకున్నాయి. ఈవిధంగా అంచనా వేసిన సమయం కంటే ముందే రుతుపవనాలు తరలి రావడం గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ సమాచారాన్ని భారత వాతావరణ విభాగం (IMD) కూడా ధ్రువీకరించింది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి విస్తరించే అవకాశముంది. వీటి ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
Also Read :Keshava Rao Encounter : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై అనుమానాలివీ
నైరుతి రుతుపవనాలు ఎందుకంత ముఖ్యం ?
మన దేశంలో 52 శాతం నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. భారతదేశపు మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో దాదాపు 40 శాతం ఈ సాగు భూమి నుంచే లభిస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని తాగునీటి అవసరాలు తీరడానికి, విద్యుత్ ఉత్పత్తికి ఆధారంగా ఉన్న జలాశయాలను తిరిగి నింపడానికి నైరుతి రుతుపవనాలే కీలకం. భారత దేశ జీడీపీకి సైతం ఇది తోడ్పాటును అందిస్తోంది.
Also Read :Rohingyas : నడి సముద్రంలో మునిగిన ఓడలు.. 427 మంది మృతి
ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్
నైరుతి రుతు పవనాలు(Southwest Monsoon) ముందే వచ్చేయడం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల ఈ ఏడాది సాధారణం కంటే భారీ వర్షాలు పడనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ ఈరోజు (శనివారం) సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.ఇక ఏపీలో కూడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు.