Vemulavada: అధికారపార్టీకి షాక్ ?…ఆ సీటు కాషాయం ఖాతాలోకి..?
తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ...ఆ దిశగా పయనిస్తోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ...119 నియోజకవర్గాల్లో సంస్థాగతంగా బలపడటమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది.
- By hashtagu Published Date - 12:46 PM, Wed - 13 July 22

తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ…ఆ దిశగా పయనిస్తోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ…119 నియోజకవర్గాల్లో సంస్థాగతంగా బలపడటమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు ఐదులోపు సీట్లు ఉన్న కమలం…ఈసారి 60 సీట్లను టార్గెట్ గా ఎజెండాగా పెట్టుకుంది. ఎలాగైనా సరే అధికార టీఆరెస్ పార్టీకి చెక్ పెట్టాలి. అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఇదే క్రమంలో ప్రతి నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. ఎక్కడిక్కడ పార్టీని బలోపేతం చేయడంపై నజర్ పెట్టింది.
ఈ నేపథ్యంలో కాషాయం పార్టీ….వేములవాడ నియోజకవర్గంపై దృష్టిసారించింది. ఎందుకంటే వేములవాడలో బీజేపీ గెలిచే బలం ఎక్కువగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ సీటు ఖచ్చితంగా బీజేపీ ఖాతాలోనే పడుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అందుకే ఇప్పుడు బీజేపీ నేతల కన్ను వేములవాడపై పడింది. దీంతో ఈ సీటు కోసం ఆశావాహుల పోటీకూడా పెరిగింది. ఇక్కడి నుంచి పోటీ చేయాలని జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమా ఆశలు పెట్టుకున్నారు. అటు సిరిసిల్ల బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామక్రుష్ణ కూడా కన్నేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సమయలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ సీటు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఎందుకంటే గత రెండు ఎలక్షన్స్ లో కరీంనగర్ అసెంబ్లీలోపోటీ చేసి ఓడిపోయారు బండి. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు బండిసంజయ్. టీఆరెస్ బలంగా ఉన్న కరీంనగర్ సీటు కంటే బీజేపీ బలంగా ఉన్న వేములవాడ అయితే బెటర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
వేములవాడ నుంచి బండిసంజయ్ కాకుండా వేరే బీజేపీ అభ్యర్థి ఎవరు పోటీ చేసినా…విజయం మాత్రం కమలంపార్టీలోనే పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ టీఆరెస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అంతేకాదు చెన్నమనేని పౌరసత్వంపై కూడా కేసు నడుస్తోంది. వేములవాడ ప్రజలకు చెన్నమనేనిఎప్పుడూ అందుబాటులో ఉండరు. ఇవన్నీ కూడా అధికార టీఆరెస్ కు మైనస్ గా ….బీజేపీకి ప్లస్ గా మారాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు మళ్లీ సీటు ఇచ్చినట్లయితే…గెలవడం కష్టమని టీఆరెస్ వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ కు అంతలేదని తెలుసు. ఇక అక్కడ బలపడింది కేవలం బీజేపీ మాత్రమే. కాబట్టి రానున్న ఎన్నికల్లో వేములవాడలో బీజేపీ గెలుపు ఖాయమని తెలుస్తోంది.