Telangana – Chandrababu : తెలంగాణలో టీడీపీకి పునరుజ్జీవం.. చంద్రబాబు నెక్ట్స్ టార్గెట్
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మళ్లీ గద్దెనెక్కారు. ఇప్పుడు ఆయన తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది.
- By Pasha Published Date - 07:56 AM, Thu - 13 June 24

Telangana – Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మళ్లీ గద్దెనెక్కారు. ఇప్పుడు ఆయన తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా టీడీపీ ఉండిపోయింది. లోక్‌సభ పోల్స్‌లోనూ సైకిల్ పార్టీ పోటీ చేయలేదు. ఏపీలో గెలుపు జోష్‌తో ఉన్న టీడీపీ. తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే జోష్‌తో పోటీ చేసేందుకు రెడీ అవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏపీలో బీజేపీ, జనసేనలతో జత కట్టడం టీడీపీకి కలిసొచ్చింది. తెలంగాణలో అదే విధంగా ఆ రెండు పార్టీలతో కలిసి ముందుకు సాగాలనే వ్యూహంతో చంద్రబాబు ఉన్నారట.
We’re now on WhatsApp. Click to Join
కాంగ్రెస్, బీజేపీ ధాటికి బీఆర్ఎస్ బలహీనపడిన ప్రస్తుత తరుణమే తెలంగాణలో టీడీపీ పునరుజ్జీవానికి కరెక్ట్ టైం అని ఆయన భావిస్తున్నారట. ప్రాంతీయవాద సెంటిమెంట్‌నే నమ్ముకున్న బీఆర్ఎస్‌కు కాలం చెల్లిందని.. డెవలప్మెంట్ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు పట్టం కడుతున్నారు అనేందుకు తాజా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని టీడీపీ అధినాయకత్వం అనుకుంటోందట. కేంద్రంలో కింగ్ మేకర్‌గా మారిన టీడీపీ ఒకవేళ తెలంగాణలో యాక్టివ్ అయితే దానిలో చేరేందుకు బీఆర్ఎస్ సహా పలు పార్టీల కీలక నేతలు క్యూ కడతారనే అంచనాలు వెలువడుతున్నాయి. రానున్న రోజుల్లో ఆ దిశగా టీడీపీ హైకమాండ్(Telangana – Chandrababu) కసరత్తు చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read :CM Chandrababu: తిరుమల చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు…
టీడీపీ గుర్తుకు, పేరుకు ఇప్పటికీ తెలంగాణలో క్షేత్రస్థాయిలో మంచి క్రెడిబిలిటీ ఉందని.. దీర్ఘకాలిక వ్యూహంతో దాన్ని వాడుకుంటే పార్టీకి ప్రయోజనం కలుగుతుందని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. తొలుత ఆ పదవిని సరైన నేతతో భర్తీ చేయడంపై చంద్రబాబు ఫోకస్ చేసే అవకాశం ఉంది. దీనిపై సమగ్ర ప్రణాళికా వ్యూహంతో త్వరలోనే తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నట్లు సమాచారం. టీటీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న బీఆర్ఎస్ కీలక నేతల అంశంపైనా చంద్రబాబు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఓ ఇన్ ఛార్జిని కూడా చంద్రబాబు నియమిస్తారని తెలుస్తోంది.