Congress MLA: పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే
నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని, వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందనే ధ్యేయంతో ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు.
- By Gopichand Published Date - 05:12 PM, Tue - 3 December 24

Congress MLA: నేటి బాలలే రేపటి భవిష్యత్తు.. వారి ఆరోగ్య పరిరక్షనే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) అన్నారు. ప్రభుత్వం డైట్ చార్జీలను 40% పెంచిందని, పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. మెనూ ప్రకారం ఆహరం ఉండాలని, జిల్లాలోని 164 గురుకులాలు, వసతి గృహాలను పరిశీలించేందుకు 82 మంది ప్రత్యేక అధికారుల నియామకం చేపట్టినట్లు ఆయన వివరించారు. వసతి గృహాలు, గురుకులాల్లో శానిటేషన్, క్లీనింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తాజాగా మహేంద్ర హిల్స్ ఎస్సీ బాలికల గురుకులంను సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు.
నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని, వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందనే ధ్యేయంతో ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మంగళవారం కంటోన్మెంట్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గణేష్‌తో కలిసి వెస్ట్ మారేడ్‌పల్లి మహేంద్ర హిల్స్‌లో గల ఎస్సీ బాలికల గురుకులంను తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక్కడ చదువుతున్న పిల్లలను మన పిల్లలనే భావనతో చూడాలని మంచి విద్యతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. గురుకులాలు వసతి గృహాల్లో చదువుతున్న పిల్లల ఆరోగ్యం బాగుండాలనే ధ్యేయంతో 40% డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని తెలిపారు. కలెక్టర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో కలసి కిచెన్ గది, స్టోర్ రూమ్, రిజిస్టర్లను పరిశీలించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసారు. స్టోర్ గదిలో ఉన్న బియ్యం, కందిపప్పు, కూరగాయలు, పసుపు, కారం పొడి ప్యాకెట్‌లను, వాటి నాణ్యతను అలాగే కిచెన్ గదిలో కూరగాయాలు, ఫ్రూట్స్ ను పరిశీలించారు. వంట చేసే గిన్నెలను ఎప్పడికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణకై పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు.
వస్తువుల నాణ్యత ప్రమాణాలు చెక్ చేస్తున్నారా? స్టూడెంట్స్ కమిటీ పరిశీలిస్తుందా అని అడిగి తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలని సూచించారు. తదుపరి వారు విద్యార్థులతో కలసి సహాపంక్తి భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్ఎస్ డబ్ల్యూఎస్ రాష్ట్ర అధికారి ఎం బీరయ్య, గురుకులం ప్రిన్సిపాల్ శీలం సునీత, ఎస్‌డబ్ల్యూవో మోహన్, వార్డెన్ జానకమ్మ, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.