Protest Against CI : సీఐ నాగేశ్వరరావును అరెస్ట్ చేయాలని ధర్నాకి దిగిన కాంగ్రెస్, బీజేపీ
ఓ మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాచకొండలో విపక్షాలు నిరసన చేపట్టాయి.
- Author : Prasad
Date : 10-07-2022 - 5:24 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్: ఓ మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాచకొండలో విపక్షాలు నిరసన చేపట్టాయి. ఎల్‌బీనగర్ డీసీపీ కార్యాలయం వద్దకు కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఇన్‌స్పెక్టర్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఆందోళన చేపట్టింది. పలువురు పార్టీ కార్యకర్తలు వనస్థలిపురం ఏసీపీ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. ఆందోళనకారులను శాంతింపజేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. చివరకు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. మహిళను బెదిరించడంతో పాటు బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావుపై కేసు నమోదైంది.
బాధితురాలి భర్త 2018లో బేగంపేటలో చీటింగ్ కేసులో ఉన్నాడు. ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు టాస్క్‌ఫోర్స్‌లో పని చేస్తూ ఈ కేసును విచారించారు. ఈ తరువాత ఆ మహిళ భర్తను ఆదిబట్లలోని తన పొలంలో హెల్పర్‌గా నియమించి పని చేయించుకున్నాడు. ఆ తరువాత మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడటంతో చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు ఎస్‌వోటీ పోలీసుల ముందు లొంగిపోయాడు.