Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు!
నీటిపారుదల శాఖాధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
- By Gopichand Published Date - 07:40 PM, Wed - 27 August 25

Minister Uttam Kumar Reddy: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడాలని తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన అనంతరం ఆయన నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
యుద్ధ ప్రాతిపదికన చర్యలు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వరద నివారణ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 24 గంటలు జలాశయాలను పర్యవేక్షించడంతో పాటు, కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గండ్లు లేదా ఇతర నష్టాలు సంభవిస్తే వెంటనే జీఓ నంబర్ 45 కింద అత్యవసర నిధులను ఉపయోగించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
క్షేత్ర స్థాయిలో పర్యటనలు
అధికారులు రౌండ్ ది క్లాక్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ వరద ప్రమాదం ఉందని భావిస్తే వెంటనే కంట్రోల్ రూమ్‌లను అప్రమత్తం చేయాలని మంత్రి చెప్పారు. నష్ట నివారణ చర్యలకు అవసరమైన ఇసుక బస్తాలు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పంపుహౌస్‌ల నిర్వహణను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: Commonwealth Games: కామన్‌వెల్త్ గేమ్స్.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం!
జిల్లా అధికారులతో సమన్వయం
నీటిపారుదల శాఖాధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ వంటి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అన్ని విభాగాల అధికారులను రంగంలోకి దించినందున, నీటిపారుదల శాఖ కూడా విపత్తులను నివారించడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పారు.
నిజాంసాగర్ పరిస్థితిపై ప్రత్యేక దృష్టి
కామారెడ్డి జిల్లా నుంచి అందిన సమాచారం ప్రకారం, నిజాంసాగర్‌కు ఇప్పటికే 1.52 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండగా, అదనంగా మరో 86 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నందున, అక్కడి జలాశయ పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు.
కృష్ణా, గోదావరి బేసిన్ల పర్యవేక్షణ
కృష్ణా, గోదావరి బేసిన్లలోని నీటి నిల్వల పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని, పూర్తిస్థాయి నీటి మట్టాలు చేరిన సమాచారాన్ని గుర్తించాలని ఇంజినీరింగ్ అధికారులను కోరారు. పంపులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయో లేదో సమీక్షించుకుని, అవసరమైతే అదనపు పంపింగ్‌తో నీటి మట్టాలను సమర్థవంతంగా నియంత్రించాలని సూచించారు.
నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యత
ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌లో అవసరమైనంత మేరకు నీటిని నింపాలని, ఎడమ కాలువ నుండి వృథాగా పోతున్న నీటిని సముద్రం పాలు కాకుండా చూడాలని మంత్రి చెప్పారు. గోదావరి బేసిన్‌లోని శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టుల పనితీరును సమీక్షించారు. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్‌లలో పంపింగ్‌ను వేగవంతం చేసి, పూర్తిస్థాయి నీటి మట్టాలు నిండేలా చూడాలని ఆదేశించారు. పంపింగ్‌లో ఎటువంటి ఆటంకాలు రాకుండా విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.