Phone Tapping Case : అమెరికాలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్.. పాస్‌పోర్ట్ రద్దు.. అదొక్కటే దిక్కు!
ప్రస్తుతం అమెరికా కాన్సులేట్, భారత ప్రభుత్వం సహకారంతో ప్రభాకర్ రావును(Phone Tapping Case) రాష్ట్రానికి రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
- By Pasha Published Date - 04:46 PM, Wed - 9 April 25

Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో ఎస్‌ఐబీ చీఫ్‌గా వ్యవహరించిన ప్రభాకర్‌రావుకు షాకిచ్చే వార్త ఇది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నఆయన పాస్‌పోర్ట్‌ను రద్దు చేశారు. ఈమేరకు పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందింది. ప్రభాకర్‌రావుపై పోలీసులు రెడ్ కార్నర్ నోటీసును జారీ చేయడంతో, ఆయన పాస్‌పోర్టును రద్దు చేశారు.
Also Read :Salman Khan Marriage: సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకపోవడానికి అలాంటి కారణముందా ?
గ్రీన్ కార్డు కోసం విఫల యత్నం
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు పాత్రను బలపరిచే ఆధారాలు చాలానే పోలీసులకు దొరికాయి. ఇందుకు బలం చేకూర్చే వాంగ్మూలాలను పలువురు ఇప్పటికే ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుకు ఈవిషయం తెలిసింది. దీంతో ఆయన అమెరికాలోనే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఈక్రమంలో గ్రీన్‌కార్డుకు అప్లై కూడా చేసుకున్నారు. ప్రభాకర్ పాస్ పోర్ట్‌ను జప్తు చేయాలని కొన్ని నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ పోలీసులు కోరారు. దీనిపై అమెరికా విదేశాంగ శాఖకు సమాచారాన్ని పంపారు. దీన్ని చూశాక.. ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డును ఇచ్చేందుకు అమెరికా విదేశాంగ శాఖ నో చెప్పింది.
Also Read :Telugu States Alert : ఏపీ, తెలంగాణలకు అలర్ట్.. వర్షాలు, పిడుగుపాట్లు, ఈదురుగాలులు
నెక్ట్స్ జరగబోయేది అదే..
ప్రస్తుతం అమెరికా కాన్సులేట్, భారత ప్రభుత్వం సహకారంతో ప్రభాకర్ రావును(Phone Tapping Case) రాష్ట్రానికి రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సీఐడీ నుంచి సీబీఐకి లేఖ రాశారు. సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌కు సమాచారాన్ని అందించారు. దీంతో ప్రభాకర్‌కు రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేశారు. ఆ తర్వాతే ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును జప్తు చేస్తున్నట్లు పాస్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. జప్తు చేసిన పాస్‌పోర్టును ప్రభాకర్ రావు హ్యాండోవర్ చేయకుండా, తన వద్దే పెట్టుకోవడంతో అధికారులు దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ప్రభాకర్ రావు అమెరికా నుంచి వేరే దేశానికి వెళ్లడానికి, ఇండియాకు రావడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో ఉన్న అధికారులు ప్రభాకర్‌రావును ఇంటర్‌పోల్‌కు అప్పగిస్తే.. ఇంటర్‌పోల్ సహాయంతో హైదరాబాద్‌కు రప్పించనున్నారు.