CM Revanth Reddy : కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లో ఎంట్రీ లేదు: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రానికి ఆ కుటుంబమే ప్రధాన శత్రువని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుల విషయంపై స్పందించిన సీఎం రేవంత్, ఢిల్లీలో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. తాను హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాతనే మంత్రులతో సంప్రదించి శాఖల కేటాయింపులు జరిపామని పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 02:09 PM, Wed - 11 June 25

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించే అవకాశం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఆ కుటుంబమే ప్రధాన శత్రువని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుల విషయంపై స్పందించిన సీఎం రేవంత్, ఢిల్లీలో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. తాను హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాతనే మంత్రులతో సంప్రదించి శాఖల కేటాయింపులు జరిపామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో కేవలం కర్ణాటక కులగణన అంశంపై మాత్రమే చర్చలు జరిగినట్లు తెలిపారు.
Read Also: KCR : ముగిసిన కేసీఆర్ విచారణ..50 నిమిషాలు ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్
కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని సీఎం వెల్లడించారు. వచ్చే రెండు రోజుల్లోనే ఈ సమావేశం నిర్వహించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ప్రజల ముందుంచుతానని హామీ ఇచ్చారు. ప్రజల సొమ్ముతో జరిగిన ఈ భారీ అవినీతి ప్రాజెక్టు వెనకున్న వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని రేవంత్ అన్నారు. తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుగా నిలుస్తున్న వ్యక్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డేనని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి అనేక ప్రాజెక్టుల విషయంలో నిధుల కోసం ప్రయత్నాలు చేయాల్సిన ఆయన ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా నిధులు సాధించలేదని విమర్శించారు. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రజల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర రాజకీయాల్లో పాలనలో పారదర్శకతను తీసుకురావడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వంగా తమ ప్రభుత్వానికి నైతిక బాధ్యత ఉందని, అధికార దుర్వినియోగం, అవినీతికి చోటు ఉండదని హామీ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో దాదాపు అన్ని ప్రాజెక్టులు లాభంకంటే నష్టాన్ని కలిగించాయన్నారు. వాటిపై సమగ్ర విచారణ జరిపి తప్పుదారుల్లో నడిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక పై రాష్ట్రంలో కుటుంబ పాలనకు తావు ఉండదని, ప్రజాస్వామ్య విలువల ఆధారంగా పాలన సాగుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాను సీఎం అయినప్పటి నుంచి ప్రతి నిర్ణయమూ పార్టీ, మంత్రివర్గంతో సంప్రదించుకుంటూనే తీసుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని, న్యాయంగా పాలన చేస్తామని ఆయన చెప్పారు.
Read Also: Nicholas Pooran: నికోలస్ పూరన్ రిటైర్మెంట్‌కు కారణం ఇదేనా?