CM KCR : బాబు నాన్చుడు..కేసీఆర్ హైజాక్!
'చూద్దాం..చేద్దాం...` చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లిన వాళ్లకు తరచూ వినిపించే ముక్తసరి మాటలు. నాన్చుడు ధోరణి ఆయనకు అలవాటు. ఆ విషయం చంద్రబాబు అనుచరులకు బాగా తెలుసు. కొన్ని సందర్భాల్లో నాన్చుడు కలిసి వస్తుందేమోగానీ..చాలా సందర్భాల్లో పార్టీ నష్టం కలిగించింది.
- By CS Rao Published Date - 04:02 PM, Thu - 13 January 22

‘చూద్దాం..చేద్దాం…` చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లిన వాళ్లకు తరచూ వినిపించే ముక్తసరి మాటలు. నాన్చుడు ధోరణి ఆయనకు అలవాటు. ఆ విషయం చంద్రబాబు అనుచరులకు బాగా తెలుసు. కొన్ని సందర్భాల్లో నాన్చుడు కలిసి వస్తుందేమోగానీ..చాలా సందర్భాల్లో పార్టీ నష్టం కలిగించింది. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన సమయంలో విధానపరమైన అంశాలపై తుది నిర్ణయం తీసుకోవడానికి బాబు టైం తీసుకుంటాడు. ఫలితంగా ప్రత్యర్థి పార్టీలకు సమాచారం వెళ్లడంతో వాళ్ల మేనిఫెస్టోలోకి ఆ అంశాలు చేరడం జరుగుతోంది.అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని 2018లోనే చంద్రబాబు ఆలోచించాడు. ఆ మేరకు పార్టీలో కూడా చాలా సందర్భాల్లో చర్చించాడు. అప్పటికే కాపు రిజర్వేషన్ అంశం తెరపై ఉంది. మళ్లీ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇస్తే..మరిన్ని ఇబ్బందులు వస్తాయని ఆయన భావించాడు. దానిపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని పార్టీలోని మేనిఫెస్టో కమిటీకి అప్పగించాడు. వాళ్లు తుది నిర్ణయం తీసుకునేలోపే..అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ మోడీ ప్రకటించాడు.
Also Read : కేసీఆర్ 2023-24 ‘బ్రహ్మాస్త్రం’ అదే.!
కేంద్రం ప్రకటించిన 10శాతం రిజర్వేషన్ లో 5శాతం కాపులకు ఇస్తానని చంద్రబాబు ప్రకటించాడు.దీంతో టీడీపీకి వెన్నుముఖంగా ఉండే బీసీలు దూరం అయ్యారు. సంప్రదాయ ఓటు బ్యాంకును టీడీపీ పోగొట్టుకుంది. ఆ ఓటు బ్యాంకు వైసీపీ వైపు మళ్లింది. అందుకే 2019 ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ పరిమితం అయింది. ఇక జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్రచారం వెనుక ఉన్న లాజిక్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందింది.
సంక్షేమ పథకాలను 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పెద్ద ఎత్తున అమలు చేశాడు. కానీ, వాటి అమలులో అవినీతి చొరబడింది. వివిధ రకాల కార్పొరేషన్ల ద్వారా సంక్షేమ పథకాలను థర్డ్ పార్టీ ద్వారా టీడీపీ సర్కార్ అందించింది. వస్తువుల రూపంలో సంక్షేమ పథకాలను చంద్రబాబు అందించాడు. ఉదారణకు కుట్టు మిషన్లు, ఇస్ట్రీ పెట్టెలు, రైతులకు ట్రాక్టర్లు, మస్కిటో గన్స్, డ్వాక్రా సంఘాలకు వివిధ రకాల వస్తువులు ఆనాడు టీడీపీ సర్కార్ అందించింది. ఆ వస్తువులు కాంట్రాక్టర్ల ద్వారా లబ్దిదారునికి చేరేవి. ఇక్కడే అవినీతికి, అక్రమాలకు అవకాశం ఏర్పడింది. ఇంచుమించు అవే పథకాలను జగన్ బటన్ నొక్కి డబ్బు రూపంలో బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నాడు. ఈ లాజిక్ ను తెలుగుదేశం పార్టీ గ్రహించలేకపోయింది.
Also Read : దేశ రెండో రాజకీయ కేంద్రంగా హైదరాబాద్?
వాస్తవంగా 2009 ఎన్నికలప్పుడే నగదు బదిలీ స్కీంను తెలుగుదేశం పార్టీ తెరమీదకు తీసుకొచ్చింది. ఆ పథకం గురించి లోకేష్ అధ్యయనం చేశాడు. ఆనాడే ప్రజల మధ్యకు నగదు బదిలీని తీసుకెళ్లారు. ఆ ఎన్నికల్లో మహా కూటమి ఓడిపోవడంతో ఆ స్కీంను పక్కన పెట్టేశారు. ఒక రకంగా చెప్పాలంటే..అటకెక్కించారు. లోకేష్ మదిలో నుంచి పుట్టిన నగదు బదిలీని ఇప్పుడు జగన్ సర్కార్ నవరత్నాల రూపంలో అమలు చేస్తోంది. బడ్జెట్ ను పరిశీలిస్తే..చంద్రబాబు హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాల వాటా ఎక్కువగా కనిపిస్తోంది. జగన్ ఇస్తోన్న సంక్షేమ పథకాల వాటా బడ్జెట్ లో తక్కువగానే ఉంటుంది. కానీ, సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేసే ప్రభుత్వంగా జగన్ సర్కార్ కు గుర్తింపు వచ్చేసింది. ఇక ఇప్పుడు 2024 నాటికి మేనిఫెస్టో ఎలా తయారు చేయాలి? అనే అంశంపై తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా అధ్యయనం జరుగుతోంది. రైతులకు ప్రతి నెలా పెన్షన్ ఇచ్చే పథకాన్ని రూపొందించాలని ఇటీవల టీడీపీ మేనిఫెస్టో కమిటీ స్టడీ చేసింది. 45 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ. 3వేల ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఆ నోటా ఈ నోటా టీఆర్ఎస్ పార్టీకి ఆ విషయం లీకు అయింది. రైతు పెన్షన్ పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకుంటున్నాడని తెలుస్తోంది.డిగ్రీ వరకు విద్యను ఉచితంగా అందించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్యాన్ని ఉచితంగా అందించే స్కీంను సిద్ధం చేస్తుంది. వీటితో పాటు రైతులకు సబ్సీడీతో డీజిల్ అందించే దిశగా మేనిపెస్టోను తయారు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న డీజిల్ ధరలను రైతులు భరించలేక పోతున్నారు. వ్యవసాయం చేసుకునే రైతులకు డీజిల్ ను సగం ధరకు అందించాలని యోచిస్తోంది. బ్రాండ్ బ్యాండ్ ద్వారా నెలకు రూ. 150లకు టీవీ, ఫోన్, అందించేలా ప్లాన్ చేస్తున్నారు. మొబైల్ రీ చార్జికి సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో వృద్ధాశ్రమాలను నిర్వహించేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. రైతు రుణమాఫీని ఒక లక్ష వరకు అమలు చేయడానికి టీడీపీ మేనిఫెస్టో కమిటీ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇలా పలు పథకాలను అమలు చేయడానికి అవసరమైన విధానపరమైన నిర్ణయాలు వెల్లడించడానికి టీడీపీ సిద్ధం అవుతోంది. గతంలో కొన్ని విధానపరమైన అంశాలు లీకు కావడంతో ప్రత్యర్థి పార్టీలు లాభపడిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పటికైనా చంద్రబాబునాయుడు నాన్చకుండా వెంటనే ప్రకటిస్తే..పార్టీకి మేలు చేకూరుతుంది. లేదంటే..ప్రత్యర్థి పార్టీలు రైతు పెన్షన్ పై ఒక ప్రకటన చేసే అవకాశం లేకపోలేదు.