CM KCR : కేసీఆర్ 2023-24 ‘బ్రహ్మాస్త్రం’ అదే.!
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వేసే ఎన్నికల అస్త్రాలు సుదర్శన చక్రంలా పనిచేస్తాయి. గత ఎన్నికల ఫలితాలను గమనిస్తే..ఆ విషయం అర్థం అవుతోంది. ఈసారి (2023) ఎన్నికల కోసం రైతులపై రామబాణంలాంటి అస్త్రాన్ని సంధించబోతున్నాడు.
- By CS Rao Published Date - 01:24 PM, Thu - 13 January 22

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వేసే ఎన్నికల అస్త్రాలు సుదర్శన చక్రంలా పనిచేస్తాయి. గత ఎన్నికల ఫలితాలను గమనిస్తే..ఆ విషయం అర్థం అవుతోంది. ఈసారి (2023) ఎన్నికల కోసం రైతులపై రామబాణంలాంటి అస్త్రాన్ని సంధించబోతున్నాడు. కనీసం 45 ఏళ్లు నిండిన రైతులందరికీ ప్రతి నెలా రూ. 3 నుంచి రూ. 5వేల పింఛను ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే రైతుబంధు రూపంలో 50వేల కోట్లు రైతులకు ఇచ్చిన చరిత్రను లిఖించుకున్నాడు. రైతు బీమాను రూ. 5లక్షలు ఇస్తున్నాడు. రుణమాఫీ చేసిన సీఎం గా కేసీఆర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో రుణమాఫీ పథకాన్ని ఎన్నికల అస్త్రంగా సంధించాడు. ఆ ఎన్నికల్లో 63 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని అధికారాన్ని చేపట్టాడు. అప్పటి నుంచి తిరుగులేని నాయత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండోసారి 2018 ఎన్నికల్లో రైతుబంధు పథకాన్ని అస్త్రంగా విసిరాడు. ఆ ఎన్నికల్లో 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని అధికారాన్ని నిలబెట్టుకున్నాడు. మూడోసారి అధికారంలోకి రావడానికి రైతు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నాడని పార్టీ వర్గాల టాక్.
Also Read : దేశ రెండో రాజకీయ కేంద్రంగా హైదరాబాద్?
తెలంగాణ వ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతులు 90శాతం ఉన్నారు. కేవలం10శాతం మాత్రమే పెద్ద రైతులు ఉన్నారని లెక్క. రెండుశాతం మాత్రమే బడా రైతులు ఉన్నారని రైతుబంధు స్కీం ద్వారా సర్కార్ లెక్కించింది. అందుకే, రైతులందరికీ ఆ పథకాన్ని అమలు చేస్తున్నాడు. రెండుశాతం రైతుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు పెట్టడానికి కేసీఆర్ ఇష్టపడలేదు. ఫలితంగా వందలాది ఎకరాలు ఉన్న వాళ్లకు కూడా రైతు బంధు పథకం వర్తిస్తోంది. హుజరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేంద్ర కు కోట్ల రూపాయల రైతుబంధు పథకం డబ్బు వచ్చిన అంశం తెర మీదకు వచ్చింది. తాజాగా మంత్రి మల్లారెడ్డికి రైతుబంధు పథకం కింద సుమారు 6కోట్ల రూపాయాల వ్యవహారం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇవ్వని విధంగా రైతులకు 50వేల కోట్లు రైతుబంధు కింద ఇచ్చిన న్యూస్ ట్విట్టర్ లో ట్రెండింగ్ అయింది. దేశ వ్యాప్తంగా ఆ పథకాన్ని అమలు చేయాలని తాజాగా కేసీఆర్ డిమాండ్ చేస్తున్నాడు. ఆ మేరకు ఇటీవల ప్రగతిభవన్లో కలిసిన ఆర్జేడీ నేతలు లలూ ప్రసాద్ యాదవ్, తేజస్విలతో అభిప్రాయాన్ని పంచుకున్నాడని తెలిసింది. ఇటీవల కమ్యూనిస్ట్ నేతలు ఆయన్ను కలిసినప్పుడు రైతుబంధు, బీమా తదితరాల గురించి ప్రస్తావించడం ద్వారా వాళ్లను ఆకట్టుకున్నాడని ప్రగతిభవన్ వర్గాల వినికిడి. కాళేశ్వరంతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలాంటి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన అంశంపై జాతీయ నేతలతో చర్చిస్తున్నారని తెలిసింది.
Also Read : జైలు, ఫ్రంట్..గేమ్!
గుజరాత్ మోడల్ ను ఫోకస్ చేయడం ద్వారా 2014 ఎన్నికల్లో మోడీ తిరుగులేని క్రేజ్ ను సంపాదించాడు. ఫలితంగా ఆయన ప్రధాన మంత్రి అయ్యాడు. ఇప్పుడు అదే పంథాలో తెలంగాణ మోడల్ ను ఫోకస్ చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా చర్చల్లోకి వెళ్లాలని కేసీఆర్ ప్లాన్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు మిగిలిన రంగాల పురోగతిని ఆవిష్కరించబోతున్నాడట. తెలంగాణ అభివృద్ధిని జాతీయ స్థాయిలో చర్చల్లోకి తీసుకెళ్లడంతో పాటు మూడోసారి సీఎం కావడానికి రైతు పెన్షన్ పథకాన్ని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించబోతున్నాడట.రైతు పెన్షన్ పథకంపై దేశ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరగాలని కేసీఆర్ కోరుకుంటున్నాడట. అంతేకాదు, మోడీ సర్కార్ పరిచయం చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలని ప్లాన్ చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా ఎక్కడున్నా చనిపోయిన రైతుకు సంబంధించిన కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఆ కుటుంబాలకు రూ. 3లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నాడు. మొత్తం మీద కేసీఆర్ 2023లో మరోసారి సీఎం కావడంతో పాటు 2024 సాధారణ ఎన్నికల నాటికి ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ కావడానికి రైతు పెన్షన్ పథకాన్ని అస్త్రంగా చేసుకోనున్నాడని తెలుస్తోంది. ఎంత వరకు అది ఫలిస్తుందో..చూద్దాం!