Graduate MLC Elections : ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ బరిలో జీవన్ రెడ్డి.. టీ కాంగ్రెస్ తీర్మానం
ఈ వ్యవధిలో వీలైనంత ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను(Graduate MLC Elections) నమోదు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
- Author : Pasha
Date : 28-11-2024 - 3:50 IST
Published By : Hashtagu Telugu Desk
Graduate MLC Elections : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్- కరీంనగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. దీనిపై ఇవాళ గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్‌ఛార్జి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టాలని ఈసందర్భంగా తీర్మానం చేశారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ ఎన్నికల కోసం ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఇన్‌ఛార్జిని నియమించాలని నిర్ణయించారు. ఓటర్ల నమోదు గడువు తేదీని డిసెంబరు 9 వరకు పొడిగించారు. ఈ వ్యవధిలో వీలైనంత ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను(Graduate MLC Elections) నమోదు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించాలని నిర్ణయించారు.
Also Read :Credit Card Spending : నెలలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేసిన క్రెడిట్ కార్డ్ యూజర్లు
ఈ సమావేశం ముగిసిన అనంతరం గాంధీ భవన్‌లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టాలని మేం తీర్మానం చేశాం. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది’’ అని షబ్బీర్ అలీ చెప్పారు. ‘‘మా ప్రభుత్వం పది నెలల్లోనే 53 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈవిషయాన్ని యువతకు తెలియజేయాలి. గ్రాడ్యుయేట్ల మద్దతును పొందాలి’’ అని ఆయన తెలిపారు.
Also Read :INS Arighat : విశాఖ తీరంలో ‘ఐఎన్‌ఎస్ అరిఘాత్’ నుంచి తొలి మిస్సైల్ టెస్ట్
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక వ్యూహాలను సమావేశంలో చర్చించాం. 42 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నాయకులతో ఈ సమావేశం జరిగింది. మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలనే దానిపై కసరత్తు చేశాం. పార్టీ నన్ను కూడా సంప్రదించింది. త్వరలో అభ్యర్థిపై నిర్ణయం ఉంటుంది’’ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, నాలుగు జిల్లాల ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.