ISRO : అంతరిక్షంలో మొలకెత్తిన విత్తనాలు.. ఇస్రో ఖాతాలో మరో ఘనత
ISRO : ఇస్రో 2024కు స్పేడెక్స్ ప్రయోగంతో ఘనమైన ముగింపు పలికింది. కొత్త ఏడాదిలోకి విజయంతో అడుగుపెట్టింది. రోదసీలోనే రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసే ప్రయోగాన్ని విజయవంతమైంది. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి.
- By Kavya Krishna Published Date - 11:49 AM, Sun - 5 January 25

ISRO : డిసెంబరు 30న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా స్పేడెక్స్ మిషన్‌ను నింగిలోకి పంపిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా, స్పేడెక్స్ ద్వారా పంపిన అలసంద విత్తనాలు (బొబ్బర్లు) తాజాగా అంతరిక్షంలో మొలకెత్తాయి. ఇవి సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో నాలుగు రోజుల్లోనే మొలకెత్తడం విశేషంగా మారింది. ఈ విత్తనాలు త్వరలో ఆకులు కూడా పెంచే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ-సి60 రాకెట్‌ను ఉపయోగించి రెండు ఉపగ్రహాలను పంపించారు.
స్పేడెక్స్ మిషన్‌లో నాలుగో దశ (పోయెమ్-4)ను ఉపయోగించి 24 పేలోడ్‌లను కక్ష్యలోకి పంపించారు. ఇందులో, “కంపాక్ట్ రిసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్” (క్రాప్స్) అనే సాధనం కూడా భాగంగా ఉంది. ఇది తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (వీఎస్‌ఎస్‌సీ) అభివృద్ధి చేసింది. ఇందులో ఎనిమిది అలసంద విత్తనాలను ఉంచారు. ఈ విత్తనాలు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనాన్ని సాగించేందుకు పంపినవిగా చెప్పవచ్చు.
భవిష్యత్తులో జరిగే సుదీర్ఘ రోదసీ ప్రయాణాలకు సంబంధించి, ఇది ఎంతో కీలకమైన అధ్యయనం. వ్యోమనౌకుల ఆహార అవసరాలను నెరవేర్చడానికి, వారు అంతరిక్షంలోనే మొక్కలను పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో విత్తనాలు మొలకెట్టి, రెండు ఆకుల దశకు చేరుకునే వరకు వాటి పెరుగుదలను క్రాప్స్ అనేది పరిశీలించగలదు. ఈ విత్తనాలు ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థతో కూడిన ఒక పెట్టెలో ఉంచి పెంచాలని పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ ప్రక్రియను మానిటర్ చేయడానికి కెమెరా , ఇతర పర్యవేక్షణ వ్యవస్థలు కూడా ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ గాఢత, నేల తేమ లాంటి అంశాలపై కూడా ట్రాకింగ్ వ్యవస్థలు ఉన్నాయి.
స్పేడెక్స్ కక్ష్యలో ఉన్న ఉపగ్రహం, భూమి నుంచి తొలిసారి వీడియో తీసింది. ఈ వీడియోలో మహాసముద్రాలు, తిరుగుతున్న మేఘాలు, భూమి యొక్క అందమైన దృశ్యాలను ఇస్రో తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఉపగ్రహం 400 కి.మీ. ఎత్తులో ఉంటూ భూమిని వీడియో తీసింది.
ఇక, ఈ మిషన్‌లో శాస్త్రవేత్తలు మంగళవారం (జనవరి 7న) అత్యంత కీలకమైన దశను పూర్తిచేయనున్నారు. ఆ రోజున, రెండు ఉపగ్రహాలను రోదసీలోనే అనుసంధానం చేయనున్నారు. ఇప్పటి వరకూ, అమెరికా, రష్యా , చైనా మాత్రమే ఇటువంటి అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండగా, ఇప్పుడు భారత్ కూడా వాటి సరసన చేరింది.
HYDRA : మాదాపూర్‌లో 6 అంతస్తుల అక్రమ భవనాన్ని కూల్చివేతకు హైడ్రా సిద్ధం