Lagacharla : లగచర్ల పర్యటనను అడ్డుకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం: తమ్మినేని వీరభద్రం
ఈ నెల 26 న అన్ని వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించబోతున్నామన్నారు. ఉమ్మడి వామపక్ష పార్టీల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 03:10 PM, Mon - 18 November 24

Tammineni Veerabhadram : లగచర్ల ఘటన నేపథ్యంలో పపక్ష పార్టీలు ఈ నెల 21న లగచర్లకు వెళ్లనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. చిట్ చాట్ లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..రేవంత్ ప్రభుత్వం ఏడాది పాలన ఆశా భంగం కలిగించిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు 7 వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నారన్నారు. కానీ అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యం కనుమరుగైందని తమ్మినేని వీరభద్రం ఆగ్రహించారు.
కాగా, రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీల ప్రజాసంఘాలన్నీ ఒకే వేదిక కిందకు రాబోతున్నాయన్నారు. భవిష్యత్తులో చేసే ప్రతి పోరాటాన్ని ఈ వేదిక ద్వారానే నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 26 న అన్ని వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించబోతున్నామన్నారు. ఉమ్మడి వామపక్ష పార్టీల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 21 న అన్ని వామపక్ష పార్టీలు తలపెట్టిన లగచర్ల పర్యటనను అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు.
మరోవైపు సంగారెడ్డి జైలులో లగచర్ల రైతులతో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ మాట్లాడారు. రైతులను పరామర్శించారు. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమంటూ.. ఎనిమిది నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారని ఎంపీలు అన్నారు. అందుకే బలవంతంగా భూములు లాక్కుంటామంటేనే రైతులు ఆగ్రహించారని చెప్పారు. లగచర్ల ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణం. ఘటనలో కాంగ్రెస్‌కు చెందినవారిని వదిలేశారు. లగచర్ల బాధితులను వెంటనే విడుదల వారు డిమాండ్ చేశారు.