Hyderabad CP : పోలీసుల చేయి దాటిన పాతబస్తీ అల్లర్లు.. రెండురోజుల తరువాత సీపీ పర్యటన..?
హైదరాబాద్ పాతబస్తీలో నిరసనల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
- Author : Prasad
Date : 25-08-2022 - 8:01 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ పాతబస్తీలో నిరసనల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యటించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై పాతబస్తీలో భారీ నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఎట్టకేలకు బాధిత ప్రాంతాలను సందర్శించారు. ఆగస్ట్ 23న స్థానిక నాంపల్లి కోర్టు నుండి ఎమ్మెల్యే రాజాసింగ్ బెయిల్ పొందారు. దీంతో నిరసనకారులు తమ ఆందోళనలు ఉదృతం చేశారు. రాజా సింగ్ అరెస్టు ప్రక్రియలో అనేక అవకతవకలను లేవనెత్తుతూ అతని తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. సిఆర్‌పిసిలోని సెక్షన్ 41కి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా హైదరాబాద్ పోలీసుల విధానంలో లోపం ఉందని లాయర్ వాదించారు. అప్పటి నుండి ఓల్డ్ సిటీ ఉద్రిక్తంగా ఉంది.
హైదరాబాద్‌లోని పాతబస్తీలో నిరంతర నిరసనలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ సౌత్ జోన్ పోలీసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఎలాంటి సూచనలు చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. . గతంలో మత కలహాల సమయంలో మాజీ కమిషనర్లు పురాణి హవేలీలోని పాత కమీషనర్ కార్యాలయంలో క్యాంప్ చేసిన అనేక సంఘటనలు ఉన్నాయి. అయితే ప్రస్తుత పోలీసు కమిషనర్ బంజారాహిల్స్‌లో కొత్తగా రూపొందించిన ఆపరేషనల్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. ప్రవక్తపై రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆందోళనలు ఇంకా ముగియలేదు. బుధవారం రాత్రి పోలీసులు లాఠీ ఛార్జీలు, అరెస్టులు చేసినప్పటికీ యువత వీధుల్లోకి వస్తున్నారు.
మొదటి రెండు రోజులుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ లేకపోవడంతో నిరసనలను ఎలా నిర్వీర్యం చేయాలని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సీవీ ఆనంద్ బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన లా అండ్ ఆర్డర్ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. అంతేకాకుండా ఓల్డ్ సిటీ పరిధిలోకి వచ్చే సౌత్ జోన్ డీసీపీకి కూడా శాశ్వత అధికారి లేరు. ప్రస్తుతం సౌత్ జోన్ డీసీపీ పీ సాయి చైతన్య ఇంఛార్జ్‌గా ఉన్నారు. సౌత్ జోన్ హైదరాబాద్‌లోని అత్యంత సున్నితమైన ప్రాంతంగా ఉంది. ఇక్కడ శాంతిభద్రతల విషయంలో ఆచితూచి వ్యవహరించే పోలీస్ ఉన్నతాధికారి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం పాతబస్తీలో పరిస్థితిని పర్యవేక్షించే బాధ్యతను అదనపు పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్‌కు అప్పగించారు.