Mahesh Kumar Goud : తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాధనం దోచుకుంది ఆయనే : మహేశ్‌కుమార్ గౌడ్
తెలంగాణ సాకారం చేసినందుకు కాంగ్రెస్ విలన్‌గా నిలుస్తుందా? కేసీఆరే తెలంగాణకు విలన్‌గా మిగిలిపోతారు అని అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాధనం దోచుకుంది కేసీఆరేనని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
- By Latha Suma Published Date - 04:07 PM, Mon - 28 April 25

Mahesh Kumar Goud : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఈరోజు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..ఆదివారం ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్‌పై కేసీఆర్ చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. తెలంగాణ సాకారం చేసినందుకు కాంగ్రెస్ విలన్‌గా నిలుస్తుందా? కేసీఆరే తెలంగాణకు విలన్‌గా మిగిలిపోతారు అని అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాధనం దోచుకుంది కేసీఆరేనని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ సెంటి మెంటును వాడుకోవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. పార్టీ పేరులోంచి తెలంగాణ పదాన్ని తొలగించిన కేసీఆర్ కు ఇప్పుడు జన్మభూమిని గుర్తుకు వచ్చిందా అని విమర్శలు గుప్పించారు.
Read Also: Sunil Kumar : సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను మరో 4 నెలలు పొడిగింపు
దొంగ పాస్‌పోర్టులు సృష్టించి విదేశాలకు పంపిన చరిత్ర కేసీఆర్‌ది. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చాక ఆయన సీఎం అయ్యారు. ప్రాజెక్టులు, భూముల పేరిట దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలుజేశారు. దూరదృష్టి, ఆలోచన లేకుండా ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెచ్చారు. పలాయనం చిత్తగించిన వ్యక్తి.. కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి కేసీఆర్ కి గుండెల్లో గుబులు మొదలైందన్నారు. బీఆర్ఎస్ హయంలో కేసీఆర్ కుటుంబం రైజింగ్ అయిందని జన్వాడలో ఉన్న ఫాం హౌస్ లు ఎవరివని ప్రశ్నించారు. కేసీఆర్ అరాచక పాలనను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. 420 హామీలంటూ విమర్శిస్తున్న కేసీఆర్ మీ పదేళ్ల బిఆర్ఎస్ పాలన 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. టైం, వేదిక మీరే డిసైడ్ చేయండి చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా? ఫాం హౌస్ దాటి వచ్చే దమ్ము కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు.
బీజేపీ-బిఆర్ ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనడానికి నిదర్శనం బీజేపీపై కేసీఆర్ రెండు నిమిషాల ప్రసంగం అని ఎద్దేవా చేశారు. బీజేపీపై కేసీఆర్ విమర్శలు నెమలి పించ్చంతో కొట్టినట్లు ఉందన్నారు. కేసీఆర్ ప్రసంగంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని మరోసారి రుజువైందన్నారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ చట్టంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదన్నారు. బీజేపి బీఆర్ఎస్ కుట్రపన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నాయన్నారు. రజతోత్సవ సభలో జనాల కంటే విస్కీలు ఎక్కువ ఉన్నాయని అసలు ఆ సభలో అసలు మహిళలే కనిపించలేదన్నారు. వరంగల్ సభ లో కేసీఆర్ ప్రసంగంలో పసలేదని ఇక తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందన్నారు. దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని నకిలీ గాంధీలు అనడం కేసిఆర్ దుస్సాహసానికి పరాకాష్ట అని కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దొంగ పాస్ పోర్టుల బిజినెస్ చేసుకునే మీ కుటుంబం లక్షల కోట్లకు పడగలెత్తారని ధ్వజమెత్తారు. వేదికపై అయ్య కేసిఆర్, కొడుకు కేటీఆర్ ఫ్లెక్సీ తో అల్లుడు హరీష్, కూతురు కవిత మనసుకి మరోసారి గాయమైందన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కేసిఆర్ కుటుంబం దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
Read Also: Fact Check : భారత సైన్యం ఆధునికీకరణకు విరాళాలు.. నిజమేనా ?