Harish Rao: చంద్రబాబు.. జగన్ ఇద్దరు ఇద్దరే: హరీశ్ రావు
తెలంగాణ నీటి హక్కుల కోసం ఎప్పటికీ పోరాటం చేసేది బీఆర్ఎసే అని, చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
- By Gopichand Published Date - 06:53 PM, Wed - 5 March 25

Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao).. చంద్రబాబు, వైఎస్ జగన్‌పై మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతం వట్టి మాటలేనని ఆరోపించారు. నాడు ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబు.. నేడు నీటిని అక్రమంగా తరలించే యత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణకు అన్యాయం చేయడంలో చంద్రబాబైనా, జగన్ అయినా ఇద్దరిదీ ఒకే బాట అని విమర్శించారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8మంది బిజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో విఫలమవుతున్నారని అన్నారు. కేంద్రంలో పలుకుబడి అడ్డం పెట్టుకొని చంద్రబాబు చేసే కుట్రలకు బీజేపీ వత్తాసు పలుకుతుందని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ నీటి హక్కుల కోసం ఎప్పటికీ పోరాటం చేసేది బీఆర్ఎసే అని, చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీటిని తీసుకువెళ్తున్నాని, తెలంగాణ ఏపీ రెండు కళ్ల లాంటివని, రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. పూర్తిగా సత్యదూరమైన వాస్తవాలను ఆయన నిన్న మాట్లాడారని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల కేంద్రంలో ఉన్న బీజేపీ పక్షపాత దోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆరోపించారు.
Also Read: Laila: ఓటీటీలో సందడి చేయబోతున్న లైలా మూవీ.. అధికారికంగా ప్రకటించిన మూవీ మేకర్స్!
రేవంత్ రెడ్డికి కేంద్రాన్ని ఎదిరించే దైర్యం లేదని, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదని దుయ్యబట్టారు. ఢిల్లీని చూస్తే రేవంత్ కు భయం, బాబు గారి పట్ల గురు దక్షిణ అని విమర్శలు చేశారు. దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, మీకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అయితే, నాగార్జున సాగర్ ఎడమ కాల్వను ఎండబెట్టి, సాగర్ కుడి కాల్వ నుంచి నిండుగా నీళ్లు తీసుకుపోతున్నారు అని ప్రశ్నించారు.
కృష్ణా జలాల్లో ఏపీకి తాత్కాలికంగా కేటాయించిన వాటా ప్రకారం 512 టీఎంసీలు రావాలని, కానీ మీరు 655 టీఎంసీల నీరు వాడారని లెక్కలు బయటపెట్టారు. కేసీఆర్ శక్తి యుక్తులతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించారని గుర్తుచేశారు. సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, వార్దా, కాళేశ్వరం మూడో టీఎంసీలకు అన్ని అనుమతులు సాధించి చివరి స్టేజీలో ఉందన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, చంద్రబాబు తన పలుకుబడి కేంద్రంలో ఉపయోగించి డీపీఆర్ లు వాపస్ వచ్చేలా చేశారని మాజీ మంత్రి పేర్కొన్నారు.