SLBC Tunnel Collapse : సొరంగం కూలిపోవడానికి సీఎం రేవంతే కారణం – హరీష్ రావు
SLBC Tunnel Collapse : కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపట్టిన ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు
- By Sudheer Published Date - 05:25 PM, Sat - 22 February 25

ఎస్ఎల్‌బీసీ (SLBC ) సొరంగం కూలిపోవడం (Tunnel Collapse) తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడగా, మరికొందరు లోపల చిక్కుకుపోయినట్లు సమాచారం. ప్రాజెక్టుల నిర్వహణలో అశ్రద్ధ వల్లనే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (HarishRao) విమర్శించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపట్టిన ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. గత కొద్ది రోజులుగా సొరంగంలో మట్టి కూలుతున్న లక్షణాలు కనిపించినప్పటికీ, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
Indian National Anthem: పాక్ గడ్డపై భారత జాతీయ గీతం.. వీడియో వైరల్!
ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన హరీశ్‌రావు, ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం అని వ్యాఖ్యానించారు. కొద్దిరోజుల క్రితమే సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కూలిన ఘటనను గుర్తుచేస్తూ, అప్పటి తప్పిదాలను కూడా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోలేదని, ఇప్పుడు అదే నిర్లక్ష్యం ఎస్ఎల్‌బీసీ సొరంగం విషయంలోనూ ప్రాణాంతక పరిస్థితులను తీసుకువచ్చిందని అన్నారు. కార్మికుల భద్రతను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, సరైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ విపత్తు సంభవించిందని ఆయన ఆరోపించారు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, మిగతా కార్మికులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. డీ వాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి. ఈ ఘటనకు కారణాలు తెలుసుకునేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు.