Handloom Workers: నేతన్నలకు మహర్దశ.. రూ. 68 కోట్లు విడుదల!
TGSCOకు బకాయి ఉన్న రూ. 630 కోట్లు విడుదల చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని జీవో నెం.1 ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
- By Gopichand Published Date - 07:08 PM, Tue - 26 August 25

Handloom Workers: చేనేత, జౌళి రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, నేత కార్మికులకు (Handloom Workers) ఏడాది పొడవునా పని కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘నేతన్న పొదుపు’, ‘నేతన్న భద్రత’ పథకాల లబ్ధిదారులకు 68.77 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందిరా మహిళా శక్తి పథకంతో చేనేత కార్మికులకు మంచి రోజులు వచ్చాయని ఆయన తెలిపారు.
చేనేత, జౌళి రంగాలకు రూ. 1000 కోట్లు విడుదల
మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చేనేత రంగానికి సుమారు రూ. 1000 కోట్లు నిధులు విడుదల చేశామని చెప్పారు. ‘తెలంగాణ చేనేత అభయహస్తం’ పథకంలో భాగంగా ‘నేతన్న పొదుపు’, ‘భరోసా’, ‘భద్రత’ పథకాలను అమలు చేస్తున్నామని, దీనికి రూ. 168 కోట్లు కేటాయించామని తెలిపారు. గత ప్రభుత్వం, గత సిరిసిల్ల శాసనసభ్యుడు చేనేత, జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ మాటలు చెప్పారే తప్ప బకాయిలను మాఫీ చేయలేదని ఆయన విమర్శించారు.
Also Read: Heavy rains : తెలంగాణకు హెచ్చరిక… నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ముఖ్య పథకాలు, లబ్ధిదారుల వివరాలు
నేతన్న పొదుపు
చేనేత రంగం: కార్మికుల నెలవారీ వేతనంలో 8% వాటా జమ చేస్తే ప్రభుత్వం 16% వాటాను పొదుపు ఖాతాలో జమ చేస్తుంది. 2024-25లో రూ. 290.09 కోట్లు 36,133 మంది కార్మికుల ఖాతాల్లో జమ చేయబడ్డాయి. 2025-26 సంవత్సరానికి 33,913 మంది నమోదు చేసుకున్నారు.
మరమగ్గాల రంగం: మరమగ్గాల కార్మికుల నెలవారీ వేతనంలో 8% వాటా జమ చేస్తే, ప్రభుత్వం కూడా 8% వాటా జమ చేస్తుంది. రూ. 34.07 కోట్లు 11,698 మంది కార్మికుల ఖాతాల్లో జమ చేయబడ్డాయి. ఈ పథకం కాలపరిమితిని 36 నెలల నుండి 24 నెలలకు తగ్గించారు.
నేతన్న భరోసా: జియో ట్యాగ్ మగ్గాలు ఉన్న చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ. 18,000 అనుబంధ కార్మికులకు రూ. 6,000 అందిస్తారు. ఈ పథకానికి 12 కోట్లు కేటాయించారు. నాణ్యమైన ఉత్పత్తుల కోసం ‘తెలంగాణ చేనేత బ్రాండ్’ ప్రత్యేక లేబుల్‌ను ప్రారంభించారు.
నేతన్న భద్రత (రైతు బీమా తరహాలో): నేత కార్మికుడు మరణిస్తే అతని నామినీకి రూ. 5 లక్షలు తక్షణమే అందిస్తారు. ఇప్పటివరకు 401 మంది కుటుంబాలకు రూ. 20.05 కోట్లు అందాయి.
ఇతర ముఖ్య నిర్ణయాలు
ఇందిరా మహిళా శక్తి చీరలు: 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు సంవత్సరానికి 2 చీరలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. దీనివల్ల పవర్ లూమ్ కార్మికులకు 6 నుండి 8 నెలల పాటు నిరంతరం పని లభిస్తుంది.
రుణమాఫీ: రూ. 33 కోట్లతో 5,691 మంది చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తారు.
యార్న్ డిపో: వేములవాడలో రూ. 50 కోట్లతో యార్న్ డిపో ఏర్పాటు చేశారు. ఇది పవర్ లూమ్ కార్మికులకు ఒక దీర్ఘకాలిక డిమాండ్.
టెస్కోకు బకాయిల విడుదల: TGSCOకు బకాయి ఉన్న రూ. 630 కోట్లు విడుదల చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని జీవో నెం.1 ద్వారా ఆదేశాలు జారీ చేశారు.