Free Electricity : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్: డిప్యూటీ సీఎం
Free Electricity: రాష్ట్రంలోని మొత్తం 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. ఉచిత విద్యుత్‌కి సంబంధించిన జీవో కూడా విడుదల చేశామని, ఈరోజు నుండే ఇది అమల్లోకి వస్తుందన తెలియ జేశారు.
- By Latha Suma Published Date - 07:00 PM, Thu - 5 September 24

Free Electricity For Govt Educational Institutions: నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 41 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధానం చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మొత్తం 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు నైపుణ్య యూనివర్సిటీలు..
తమ ప్రభుత్వం గురువులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మన రాష్ట్ర విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సి ఉందని.. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు నైపుణ్య యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వరదల సమస్యల వల్ల సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని తెలిపారు.
ఉచిత విద్యుత్‌కి సంబంధించిన జీవో కూడా విడుదల చేశామని, ఈరోజు నుండే ఇది అమల్లోకి వస్తుందని భట్టి విక్రమార్క తెలియ జేశారు. అనేక ప్రభుత్వ విద్యాసంస్థలు విద్యుత్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నట్టు, విద్యుత్ సదుపాయం ఉన్నప్పటికీ వాటి బిల్లులు సకాలంలో చెల్లించక విద్యుత్ కట్ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని.. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు భట్టి పేర్కొన్నారు.
ప్రపంచంతో పోటీ పడేలా విద్యావిధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, విద్యా విధానంలో మార్పులను టీచర్లు స్వాగతిస్తారని చెప్పారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని కొంత మంది వ్యతిరేకించే ప్రయత్నం చేసినా ఉపాధ్యాయులు మాత్రం స్వాగతించారని గుర్తు చేశారు.
పరిశ్రమలకు పనికొచ్చే విద్యాబుద్ధులు..
గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని బీఆర్ఎస్ పాలనలో పాఠశాల్లో శానిటేషన్ ప్రక్రియ లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.120 కోట్లతో శానిటేషన్ పనులు చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం చదివే చదువుకు చేసే పనికి పొందన లేకుండా పోతున్నదని, పరిశ్రమలకు పనికొచ్చే విద్యాబుద్ధులు నేర్పించాల్సి ఉందన్నారు. అందుకే ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు.