Malkajgiri MP: మల్కాజిగిరి ఎంపీ బరిలో బొంతు రామ్‌మోహన్
మల్కాజిగిరి స్థానంలో పోటీకి బడా నేతలు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి బండ్లగణేష్ నిల్చుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ మాజీ మేయర్ బరిలోకి దిగనున్నట్లు తాజా సమాచారం
- By Praveen Aluthuru Published Date - 10:52 PM, Sat - 3 February 24

Malkajgiri MP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. అంతకుముందు రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా కొనసాగారు. అయితే ఎమ్మెల్యే గా గెలిచి మల్కాజిగిరి నియోజవర్గ ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గంపై రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి పెరిగింది.
ప్రస్తుతం లోకసభ ఎన్నికల హడావుడి మొదలైంది. మల్కాజిగిరి స్థానంలో పోటీకి బడా నేతలు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి బండ్లగణేష్ నిల్చుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ మాజీ మేయర్ బరిలోకి దిగనున్నట్లు తాజా సమాచారం. ఆయన మరెవరో కాదు బీఆర్‌ఎస్ నేత, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్‌మోహన్‌రావు.
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే ఆసక్తిని పార్టీ హైకమాండ్‌కు తెలియజేశామని బొంతు రామ్‌మోహన్‌రావు తెలిపారు. ఒకే కుటుంబంలోని వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు, పార్టీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని తాను సూచించానని రామ్‌మోహన్ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు. తాను బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తానన్న వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. నేను ఏ పార్టీలో చేరాలని నిర్ణయించుకోలేదని బొంతు తెలిపారు.
హైదరాబాద్ మేయర్‌గా నగరాభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశాను. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర పార్టీ నాయకులపై నాకు నమ్మకం ఉంది. నా అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారనే నమ్మకం నాకుందని పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే మల్లా రెడ్డి బంధువులు ఈ టిక్కెట్ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read: Dil Raju : కేసీఆర్ ను కలిసిన దిల్ రాజు..ఎన్నికల వేళ ఇదేంటి..?