Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!
సదర్ సమ్మేళనం ఉత్సవ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు.
- By Gopichand Published Date - 01:50 PM, Sun - 19 October 25

Sadar Sammelan: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న యాదవుల సంస్కృతికి ప్రతీకగా నిలిచే సదర్ సమ్మేళన (Sadar Sammelan) ఉత్సవాలకు ఎన్టీఆర్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరికాసేపట్లో ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సాధారణంగా నగరంలో ప్రతి ఏటా దీపావళి సమయంలో యాదవ సోదరులు సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న ఈ సమ్మేళనంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నలుమూలల నుండి యాదవ సోదరులు భారీ సంఖ్యలో ఎన్టీఆర్ స్టేడియంకు చేరుకున్నారు.
Also Read: Diwali: రేపే దీపావళి.. ఈ విషయాలను అస్సలు మర్చిపోకండి!
దున్న రాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ
సదర్ ఉత్సవాల కోసం యాదవ సోదరులు ప్రత్యేకించి ఇతర రాష్ట్రాల నుండి బలమైన, అందంగా అలంకరించిన దున్న రాజులను తీసుకువస్తున్నారు. ఈ దున్నపోతుల విన్యాసాలు, వాటి రాజసం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పశు సంపదను దేవుళ్లతో సమానంగా పూజించే యాదవుల సంస్కృతికి ఈ సమ్మేళనం అద్దం పడుతుంది. ఈ ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని సుమారు 600 మంది కళాకారులతో సాంస్కృతిక శాఖ ఘనంగా వేడుకలను ప్రారంభించనుంది. కళాకారులు ప్రదర్శించే సాంప్రదాయ నృత్యాలు, పాటలు ఉత్సవ వాతావరణాన్ని మరింత ఉల్లాసంగా మారుస్తాయి.
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ముఖ్య నేతలు
సదర్ సమ్మేళనం ఉత్సవ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు. యాదవ సోదరుల సౌకర్యార్థం, వేడుకలు సజావుగా జరిగేందుకు వీరు విశేష కృషి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియం పరిసరాలలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరిగేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. సదర్ సమ్మేళనం తెలంగాణ సంస్కృతి, యాదవ సోదరుల ఐక్యతకు ప్రతీకగా నిలవనుంది.