EC Announced Final Contestants List : తెలంగాణ ఎన్నికల బరిలో 2,290 మంది పోటీ – ఈసీ
- Author : Sudheer
Date : 16-11-2023 - 3:15 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. నవంబర్ 30 న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. పలు పార్టీలను ధిక్కరించి రెబెల్స్, ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేసిన వారిని ఆయా పార్టీల నేతలు బుజ్జగించి.. వారు నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 119 నియోజకవర్గాల పరిధిలో 2,898 మంది దరఖాస్తులకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఇందులో 608 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 2,290 మంది ఎన్నికల బరిలో నిలిచినట్లు ఈసీ ప్రకటించింది. అత్యధికంగా ఎల్బీ నగర్ లో 48 మంది, అత్యల్పంగా బాన్సువాడ, నారాయణపేటల్లో ఏడుగురు పోటీలో ఉన్నారని పేర్కొంది.
ఇక అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) బరిలో నిలిచిన గజ్వేల్ (Gazwel Constituency) నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ అత్యధికంగా 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సీఎం పోటీ చేస్తోన్న మరో నియోజకవర్గం కామారెడ్డిలో (Kamareddy) 39 మంది అభ్యర్థులు తుది పోరులో ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక మంత్రి హరీశ్‌రావు (Harish Rao) పోటీ చేస్తున్న సిద్దిపేటలో 21 మంది, మంత్రి కేటీఆర్ (KTR) పోటీ చేస్తున్న సిరిసిల్లలో 21 మంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) బరిలో నిలిచిన కొడంగల్‌లో 23 మంది పోటీ చేస్తున్నారు. అలాగే మునుగోడులో 39 మంది, పాలేరు 37, కోదాడ 34, నాంపల్లి 34, ఖమ్మం 32, నల్గొండ 31, కొత్తగూడెం 30, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 10 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ప్రధానమైన నామినేషన్ల ఘట్టం పూర్తి కాగా అధికార బీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం ముమ్మరం చేశాయి.
మరోపక్క ఎన్నికల అధికారులు సైతం నేటి నుంచి పోలింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఇందుకుగాను గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రులు, ఇలా వరుస క్రమంలో అభ్యర్థుల జాబితాను రూపొందిస్తున్నారు. వాటి ఆధారంగా బ్యాలెట్ ఖరారు చేసి పోలింగ్ నిర్వహించనున్నారు.
Read Also : Chidambaram: కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పులు భారీగా పెరిగాయి: చిదంబరం