Anti Modi: అట్లుంటది స్టాలిన్ తోని.. మోదీ విషయంలో స్టాలిన్ కు, కేసీఆర్ కు ఎంత తేడా?
బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు ఏ బ్యాట్స్ మెన్ అయినా పిచ్ వదిలి వెళ్లిపోతారా? మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అలా చేశారు?
- By Hashtag U Published Date - 02:45 PM, Fri - 27 May 22

బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు ఏ బ్యాట్స్ మెన్ అయినా పిచ్ వదిలి వెళ్లిపోతారా? మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అలా చేశారు? ఈ మధ్యకాలంలో ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ ఆయనను కలవడం లేదు. కారణాలు ఏవైనా కావచ్చు? కానీ మోదీకి ముఖం చాటేస్తున్నారన్నది నిజం అంటున్నారు విశ్లేషకులు. కానీ అటుపక్క రాష్ట్రంలో ఉన్న స్టాలిన్ మాత్రం ఢీ అంటే ఢీ అని మోదీని ఎదుర్కొంటున్నారు. కేంద్రంపై పోరాడే విషయంలో స్టాలిన్ లా కేసీఆర్ ఎందుకు చేయలేకపోతున్నారు?
దేశంలో పరిపాలన మారాలని చెప్పే కేసీఆర్.. మోదీ వస్తే పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారు. కేసీఆర్ లేని తెలంగాణలో అడుగుపెట్టిన మోదీ.. కుటుంబ పాలనపై, కుటుంబ దోపిడీపై చకచకా నాలుగు మాటలు అనేసి వెళ్లిపోయారు. అదే స్టాలిన్ ను తీసుకోండి. తమ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీని సాదరంగా ఆహ్వానించారు. అలాగని నోరు కట్టేసుకుని కూర్చోలేదు. ద్రవిడ పాలన అంటే ఏమిటో చూపిస్తామని ఛాలెంజ్ చేశారు.
తమ డబ్బులు తమకివ్వడానికి కేంద్రం పెత్తనమేంటని జీఎస్టీ పంపకాల పై తీవ్రంగా స్పందించారు స్టాలిన్. ఆయన అలా అన్నప్పుడు బీజేపీ, డీఎంకే శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశాయి. అయినా సరే మోదీ మాత్రం స్టాలిన్ ను ఒక్క మాట కూడా అనలేకపోయారు. మౌనమే సమాధానమైంది. కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో మోదీని ఎదుర్కోవడానికి వెనకడుగు వేసినట్లు కనిపిస్తోంది. ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రధాని అపాయింట్ మెంట్ దొరకలేదని చెప్పే బదులు.. ఇప్పుడు రాష్ట్రానికి ఆయనే స్వయంగా వచ్చినప్పుడు.. ఆయనతో డైరెక్ట్ గా రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులపై మాట్లాడితే సరిపోయేది. కానీ కేసీఆర్ అలా ఎందుకు చేయలేదంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.