Deputy CM Bhatti: డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన.. ఆ యూనివర్శిటీ విషయంలో బిగ్ డెసిషన్!
యూనివర్సిటీలో నూతనంగా నిర్మాణం చేసే భవనాలు రాబోయే తరాలకు వారసత్వ కట్టడాలుగా చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉండాలని, ఆ విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
- By Gopichand Published Date - 08:45 PM, Thu - 27 February 25

Deputy CM Bhatti: దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని తీర్చిదిద్దడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు కావాల్సిన నిధులను సమకూరుస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Deputy CM Bhatti) తెలిపారు. గురువారం వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ (కోటి ఉమెన్స్ కాలేజ్)ని సందర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న హెరిటేజ్ బిల్డింగ్స్ ను పరిరక్షణ చేయడంతో పాటు పునరుద్ధరణ చేయడానికి కావలసిన నిధులను ప్రభుత్వం ఇస్తుందని వెల్లడించారు.
మహిళా విద్యార్థులకు కావలసిన తరగతి గదులు, ల్యాబ్స్, లైబ్రరీ, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉండడానికి కావలసిన వసతి గృహాలు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కార్యాలయం, అతిథి గృహం, ఆడిటోరియం, పరిపాలన విభాగానికి సంబంధించిన భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రదేశాలను పరిశీలించి, ఇంజనీరింగ్ అధికారులు రూపొందించిన భవన నిర్మాణ నమూనాలను తిలకించారు.
ఇటీవల పునరుద్ధరణ చేసిన దర్బార్ మహల్ హెరిటేజ్ బిల్డింగును పరిశీలించారు. దర్బార్ మహల్ పై అంతస్తులో 1779 – 1947 మధ్య, హైదరాబాదులో పనిచేసిన 57 మంది బ్రిటిష్ రెసిడెంట్లకు సంబంధించిన చిత్రపటాలు, వారి పదవీ కాలంలో హైదరాబాద్ నగర రాజకీయ, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో చేసిన అభివృద్ధికి సంబంధించి ప్రదర్శించిన చిత్రపటాలను ఆసక్తిగా తిలకించారు. పూర్వపు బ్రిటిష్ రెసిడెన్సికి సంబంధించిన చరిత్రను విజిటర్ మేనేజర్ సతీష్ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సమగ్రంగా వివరించారు.
Also Read: Central Taxes: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై రాష్ట్రాలకు పన్ను వాటా తగ్గింపు?
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో నూతనంగా నిర్వహించే భవనాలకు సంబంధించి రూపొందించిన నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యాశాఖ అధికారుల సమక్షంలో ఇంజనీరింగ్ అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు వివరించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న గార్డెన్స్ లో పచ్చదనాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు అందరిని ఆకట్టుకునే విధంగా మూసిని అనుసంధానం చేయడానికి తయారు చేసిన ప్రతిపాదనలను ఉప ముఖ్యమంత్రి కి చూపించారు.
యూనివర్సిటీలో నూతనంగా నిర్మాణం చేసే భవనాలు రాబోయే తరాలకు వారసత్వ కట్టడాలుగా చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉండాలని, ఆ విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రానా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పూజారి గౌతమి, తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి, యూనివర్సిటీ ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ సూర్య ధనుంజయ్, ప్రిన్సిపల్ లోక పావని, తదితరులు పాల్గొన్నారు.