Deputy CM Bhatti: జీతాలను ఆలస్యం చేసిన ఘనత బీఆర్ఎస్‌ది: డిప్యూటీ సీఎం భట్టి
విద్యారంగంలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచినట్లు, 11,600 కోట్లతో 58 ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణానికి ఆమోదం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
- By Gopichand Published Date - 03:56 PM, Thu - 8 May 25

Deputy CM Bhatti: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Deputy CM Bhatti) ఖమ్మంలో మెడికల్ కళాశాల శంకుస్థాపన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, విద్య, వైద్యం, ప్రజా సంక్షేమ పథకాలపై చేసిన కృషిని వివరించారు. రాష్ట్ర ఉద్యోగుల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం ముందుందని, ఈ లక్ష్యంతోనే అధికారుల కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నారని, మొదటి తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి, జీతాలను ఆలస్యం చేసినట్లు విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం 60-70 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, ప్రజలపై అదనపు భారం లేకుండా పనిచేస్తోందని వివరించారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ప్రజా ప్రభుత్వంగా తమ పాలనను అభివర్ణించారు. విద్య, వైద్య రంగాలపై గతంలో ఎన్నడూ లేనంత దృష్టి సారించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 34 ప్రభుత్వ, 29 ప్రైవేటు మెడికల్ కళాశాలల ద్వారా 9,065 సీట్లతో విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందుతోందని, మంత్రి దామోదర్ రాజనర్సింహ నేతృత్వంలో 8 కొత్త మెడికల్ కళాశాలలు స్థాపించినట్లు చెప్పారు. 2014-2025 మధ్య గత పాలకులు వైద్య రంగంలో 5,959 కోట్లు ఖర్చు చేయగా, ఇందిరమ్మ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే 11,482 కోట్లు వెచ్చించిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లు వివరించారు. దీనివల్ల 90 లక్షల కుటుంబాలకు ఉచిత వైద్యం అందుతోందని తెలిపారు.
Also Read: Operation Sindoor : పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. క్షిపణి రక్షణ వ్యవస్థపై భారత్ దాడి..!
విద్యారంగంలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచినట్లు, 11,600 కోట్లతో 58 ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణానికి ఆమోదం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే, 22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 22 వేల కోట్లతో రైతు రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరాకు 12,000 రూపాయలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. నిరుద్యోగ యువత కోసం 57 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, 30,000 ఉద్యోగాల కోసం ప్రకటన సిద్ధం చేస్తున్నట్లు, 9,000 కోట్లతో రాజీవ్ వికాసం స్వయం ఉపాధి పథకం ప్రారంభించినట్లు తెలిపారు.
గిరిజన రైతులకు 12,500 కోట్లతో ఇందిరా గిరిజన వికాసం పథకం ద్వారా స్ప్రింక్లర్లు, సోలార్ విద్యుత్, అవకాడో సాగు చేయూత అందిస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మెడికల్ కళాశాల భవనం వల్ల స్థానికంగా మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు.