Meenakshi Natarajan: కార్యకర్తలకు గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్!
ప్రతి నాయకుడు, కార్యకర్త పారదర్శకంగా, పార్టీ కోసం అంకితభావంతో పని చేయాలని మీనాక్షి సూచించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆధిపత్యం సాధించేందుకు గ్రామస్థాయి నుంచి బలోపేతం అవ్వాలని పిలుపునిచ్చారు.
- Author : Gopichand
Date : 23-06-2025 - 7:50 IST
Published By : Hashtagu Telugu Desk
Meenakshi Natarajan: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జూన్ 23న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) పీసీసీ అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, పార్టీ సంస్థాగత బలోపేతం, పెండింగ్ పనులపై చర్చించారు. సమావేశంలో మీనాక్షి నటరాజన్ కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి నాయకుడు, కార్యకర్త పారదర్శకంగా, పార్టీ కోసం అంకితభావంతో పని చేయాలని మీనాక్షి సూచించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆధిపత్యం సాధించేందుకు గ్రామస్థాయి నుంచి బలోపేతం అవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీకి సంబంధించిన అన్ని పెండింగ్ పనులను జూన్ 30, 2025లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో నాయకత్వ నియామకాలు, సంస్థాగత నిర్మాణం, క్షేత్రస్థాయి నివేదికలు సమర్పణ వంటివి ఉన్నాయి.
Also Read: Warning : పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం – వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్
ఒక్కో మండల అధ్యక్ష పదవికి ఐదుగురి పేర్లను ప్రతిపాదించాలని సూచించారు. సామాజిక కోణాన్ని (SC, ST, BC, మైనారిటీలు) దృష్టిలో ఉంచుకొని సమతుల్యతతో పేర్లను ఖరారు చేయాలని ఆదేశించారు. పార్టీలో 85 శాతం పాత నాయకులకు, 15 శాతం కొత్తవారికి అవకాశాలు కల్పించాలని సూచనలు ఇచ్చారు. దీనివల్ల పార్టీలో అనుభవజ్ఞులతో పాటు యువతకు ప్రాతినిధ్యం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల కోసం ఇద్దరి పేర్లను ప్రతిపాదించాలని ఆదేశించారు. త్వరలో ఈ పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మీనాక్షి నటరాజన్ స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయాన్ని పాటించాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 42% బీసీ రిజర్వేషన్, కుల గణన, SC వర్గీకరణ వంటి విషయాలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేయాలని సూచించారు. నాయకత్వ నియామకాల్లో SC, ST, BC, మహిళలు, మైనారిటీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేసింది. గాంధీ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, డిలిమిటేషన్ కమిటీ చైర్మన్ వంశీచంద్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కో-ఆర్డినేటర్లు, రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ సభ్యులు కూడా హాజరయ్యారు.