CM Revanth: సీఎం రేవంత్ మరో సంచలన నిర్ణయం.. వాటిపై ఉక్కుపాదం!
ప్రభుత్వంలోని నీటి పారుదల, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్‌తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేప్టటే పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలన్నారు.
- Author : Gopichand
Date : 01-03-2025 - 6:33 IST
Published By : Hashtagu Telugu Desk
CM Revanth: ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) సూచించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమన్నారు. గనుల శాఖపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. తొలుత గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
ప్రభుత్వంలోని నీటి పారుదల, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్‌తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేప్టటే పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలన్నారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీ ఎండీసీ ద్వారానే సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. సరైన ధరలకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే అక్రమంగా సరఫరా చేసే వారిపై వినియోగదారులు ఆధారపడరన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువగా వినియోగం జరుగుతోందన్నారు. తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలా నగరానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
Also Read: SLBC: ఎల్ఎల్బీసీలో గల్లంతైన 8 మంది జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది: మంత్రి
గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు, వాటి వసూళ్లపైనా సీఎం అధికారులను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం త్వరగా తీసుకొని సమస్యను పరిష్కరించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మైనర్ ఖనిజాల బ్లాక్‌ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీజీఎండీసీ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ కె.శశాంక, గనుల శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్, టీజీఎండీసీ ఎండీ సుశీల్ కుమార్, పాల్గొన్నారు.