Chalo Raj Bhavan: రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్!
తెలంగాణ కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేపు నిరసన కార్యక్రమం చేపట్టనుంది.
- By Gopichand Published Date - 09:12 PM, Tue - 17 December 24

Chalo Raj Bhavan: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైంది. సీఎం రేవంత్ నేతృత్వంలోని మంత్రి వర్గం అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోంది. తనదైన మార్క్‌తో పాలన చేస్తున్న రేవంత్.. పలు సార్లు కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇటీవల అదానీ స్కామ్ బయటపడటంతో తెలంగాణకు అదానీ గ్రూప్స్ ప్రకటించిన రూ. 100 కోట్లను తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయొద్దని ఒక లేఖ విడుదల చేసి ఆశ్చర్యపరిచారు.
ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేపు నిరసన కార్యక్రమం చేపట్టనుంది. డిసెంబర్ 18వ తేదీ అంటే బుధవారం ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ (Chalo Raj Bhavan) కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నిర్వహించనుంది.
Also Read: Congress Govt Good News : మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు
ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాలలో పరువును దెబ్బతీశాయని టీకాంగ్రెస్ ఆరోపిస్తుంది. అదానీపై ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీ లాండరింగ్, మార్కెట్ మ్యానిపులేషన్ లాంటి అంశాలలో ఆయనపై ఆరోపణలు దేశ ప్రతిష్టను దెబ్బతీశాయని చెబుతుంది.
అలాగే మణిపూర్‌లో వరసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై మోదీ ఇప్పటివరకు అక్కడకు వెళ్లకపోవడం లాంటి అంశాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాడు ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ అంశాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని టీపీసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.