TS Assembly : అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ వాకౌట్
- By Sudheer Published Date - 12:59 PM, Wed - 14 February 24

తెలంగాణలో అసెంబ్లీ (Assembly)సమావేశాలు వాడీవేడిగా నడుస్తున్నాయి. తొలి సమావేశంలోనే అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శన బాణాలు సంధించుకోగా…బడ్జెట్ సమావేశాల్లో మరింత వాడీగా మాటలు సాగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్, సీపీఐ, ఏంఐఏం ఎమ్మెల్యేలు సందర్శించిన విషయం తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ఆహ్వానం పంపుతున్నారు. నిన్న మేడిగడ్డ నుంచి కూడా మాజీ సీఎం కేసీఆర్ సభకు రావాలంటూ కామెంట్స్ చేశారు. అయినప్పటికీ కేసీఆర్ హాజరు కాలేదు.
ఇక ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ మొదలైంది. ఈ చర్చకు కోరం లేదని తొలుత బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. దీనికి 18 మండి సభ్యులం ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. 14 మందే ఉన్నారని.. లెక్కించండంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హుకుం జారీ చేశారు. బీఆర్ఎస్ తరుఫున బడ్జెట్‌లో కడియం శ్రీహరి చర్చలో పాల్గొన్నారు. బడ్జెట్‌పై ఎవరు రిప్లై ఇస్తారని కడియం ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join.
కొన్ని కారణాల వల్ల ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క సభకు హాజరు కాలేదని.. బడ్జెట్‌పై రిప్లై సమయానికి వస్తారని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బదులిచ్చారు. బడ్జెట్ చర్చపై ప్రభుత్వం సీరియస్‌గా లేదని అర్థమవుతోందని కడియం శ్రీహరి అన్నారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య తీవ్ర వాదోపవాదనలు సాగాయి. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనపై, సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ విమర్శలు చేయగా.. సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం నల్గొండ సభలో కేసీఆర్ భాష సరైనదేనా.? అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. దానిపై చర్చిద్దామా.? అని సవాల్ విసిరారు. ఇదేనా తెలంగాణ సంప్రదాయం.? అని నిలదీశారు. బొక్కబోర్లా పడ్డ బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదని.. కుంగిన మేడిగడ్డలో నీళ్లు నింపిన పరిస్థితి ఉందా.? అని నిలదీశారు. చర్చకు రమ్మంటే పారిపోయారు అంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం తీరును నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. కాళేశ్వరం, గోదావరి జలాలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ కు ఆసక్తి లేదని.. సభ నుంచి ఎప్పుడు వెళ్లిపోదామా? అని చూస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు ఈ సందర్భంగా విమర్శలు చేశారు.
Read Also : Farmers: రెండో రోజు రైతుల నిరసన..ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం