BRS -‘Gurukula Bata’ : ‘గురుకుల బాట’ చేపట్టబోతున్న బిఆర్ఎస్
BRS to conduct 'Gurukula Bata' programme : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా కొనసాగుతున్న మరణాలు విషాద సంఘటనల నేపథ్యంలో, ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరఫున గురుకుల బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు
- By Sudheer Published Date - 09:09 PM, Wed - 27 November 24

తెలంగాణ (Telangana) లోని ప్రభుత్వ పాఠశాలలో, ఆశ్రమ పాఠశాలలో , హాస్టల్స్ లలో వరుసగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా శైలజ అనే స్టూడెంట్ ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning Incidents) కు గురై చావుతో పోరాడి చివరకు ప్రాణాలు వదిలింది. ఓ పక్క ప్రాణాలు పోతున్న కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని..బిఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం దీనిపై దృష్టి సారించడం లేదు. ఈ క్రమంలో బిఆర్ఎస్ నవంబర్ 30 నుండి ‘గురుకుల బాట’ (Gurukula Bata)చేపట్టేందుకు సిద్ధమైంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా కొనసాగుతున్న మరణాలు విషాద సంఘటనల నేపథ్యంలో, ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరఫున గురుకుల బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30 తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం (November 30 to December 7) కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యాసంస్థల తో పాటు కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలను కాలేజీలను పరిశీలిస్తారన్నారు. ఈ గురుకుల బాట కార్యక్రమానికి ఎంఎల్ఏ, ఎమ్మెల్సీ, ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, విద్యార్థి విభాగం నాయకులకు సహకారం అందించాలని కేటీఆర్ సూచించారు. బాలికల విద్యాసంస్థల్లో పార్టీ తరఫున విద్యార్థి విభాగం మహిళా నాయకులు, పార్టీ మహిళా నాయకులు సందర్శిస్తారని కేటీఆర్ తెలిపారు. జడ్పీ చైర్మన్లు ఎంపీపీలు, ఎంపీటీసీలు కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మహిళా సీనియర్ నాయకులు గురుకుల విద్యాసంస్థలను సందర్శించి బాలిక సమస్యలను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని తెలిపారు.
గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. 11 నెలల్లో 52 మంది విద్యార్థుల మృతి చెందారని, ఇందులో 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలన గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో ఈ ముఖ్యమంత్రి విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కనీసం విద్యాశాఖ మంత్రి లేడన్నారు. అయినా సీఎం ఢిల్లీకి తిరిగేందుకే సమయం సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. విద్యార్థులు చనిపోతున్నప్పటికీ ఒక్క సమీక్ష నిర్వహించని ప్రభుత్వానికి ఉసురు తప్పదని హెచ్చరించారు. గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరఫున అధ్యయన కమిటీ వేస్తున్నామన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ వేస్తున్నట్లు తెలిపారు.
Read Also : Game Changer : రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?