BRS Key Decision: రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. 9 మంది సభ్యులతో కమిటీ!
రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
- By Gopichand Published Date - 04:44 PM, Mon - 20 January 25

BRS Key Decision: తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనకర స్థాయికి చేరిన రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపైన భారత రాష్ట్ర సమితి (BRS Key Decision) ఆధ్వర్యంలో 9 మందితో కూడిన అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సభ్యులు గల ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులను అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రికి, వ్యవసాయ కమిషన్ కు, BRS పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కి ఒక నివేదికను అందజేస్తుందని కేటీఆర్ తెలిపారు.
రెండు వారాల పాటు విస్తృతంగా పర్యటించిన అనంతరం రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్న ప్రధానమైన కారణాలతోపాటు రాష్ట్రంలో గత ఏడాది కాలంలో వ్యవసాయ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించి ఒక నివేదికను తయారు చేస్తుందని కేటీఆర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సన్న, చిన్న కారు, కౌలు రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటుందన్నారు.
Also Read: MLA VenkataRamana Reddy : 45 రోజుల్లోగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నాలుగు వందలకు పైగా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న ఆందోళనకర పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన రైతు రుణమాఫీ కనీసం 30 శాతాన్ని దాటకపోవడం.. రైతన్నలకు కొన్ని సంవత్సరాలుగా అందుతున్న రైతుబంధును ఆపి వేసి ఇస్తామన్న 15 వేల రూపాయల రైతు భరోసాన్ని కూడా ఎగొట్టడం వంటి ప్రధానమైన ఆర్థిక సమస్యలు రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతోపాటు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా, సకాలంలో సాగునీటి వసతి కల్పించే విషయంలో సర్కారు పూర్తిగా చేతులెత్తేయడం వల్లనే రైతన్నలు తీవ్రమైన సంక్షోభంలో కురుకుపోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లనే పూర్తిగా రాష్ట్ర వ్యవసాయ రంగం చిన్నాభిన్నమైందని అన్నారు.
రైతన్నలను, వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా దిక్కులు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేసేలా ప్రధాన ప్రతిపక్షంగా తమ వంతు పాత్ర పోషించాలన్న సదుద్దేశంతోనే ఈ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. 10 సంవత్సరాలపాటు రైతును రాజును చేసే లక్ష్యంతో పనిచేసిన భారత రైతు సమితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తుందన్నారు. విస్తృత పర్యటనలు అధ్యయనం తర్వాత పార్టీ తరఫున రూపొందించే ఈ నివేదిక ప్రభుత్వానికి అందజేసి రానున్న బడ్జెట్ సమావేశాల్లో రైతన్నల సమస్యలపై, వారికి ఇచ్చిన హామీల అమలుపై, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు ఎంసి కోటిరెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్ ఉన్నారు.