E Car Race Case : కేటీఆర్ కు ఊరట
Formula E Race Case : డిసెంబర్ 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని ఏసీబీకి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది
- By Sudheer Published Date - 05:36 PM, Fri - 20 December 24

ఈ-కార్ రేసు కేసు(Formula E Race Case)లో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR)కు హైకోర్టు కీలక (BIg Relief) ఊరటనిచ్చింది. డిసెంబర్ 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని ఏసీబీకి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ కేసుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి.
కేటీఆర్ తరుపున లాయర్ సుందరం, ఏజీ సుదర్శన్ రెడ్డి సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించారు. కేసు కొట్టేయాలని సుందరం, వద్దని సుదర్శన్ కోరారు. ఇరు వాదనలు విన్న కోర్ట్ కేటీఆర్ ను 10 రోజుల (డిసెంబర్ 30) వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని, ఈ నెల 30లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది
అంతకు ముందు కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేటీఆర్‌పై పలు సెక్షన్లు నమోదు చేశారని తెలిపారు. ఈ సెక్షన్లు ఈ కేసు కింద వర్తించవని అన్నారు. గత ఏడాది సీజన్ 9 కార్ రేసింగ్ నిర్వహించారని తెలిపారు. ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25నే ఒప్పందం జరిగిందని చెప్పారు. సీజన్ 9లో రూ.110 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. సీజన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకుందని తెలిపారు. దీంతో ప్రభుత్వం ప్రమోటర్‌గా ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగా ఈ కొత్త ఒప్పందం జరిగిందని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో స్పాన్సర్ వెనక్కి జరిగినప్పుడు ఈవెంట్ నిర్వహించకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దిబ్బతింటుందని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 2024లో కచ్చితంగా ఈ కార్ రేసింగ్ నిర్వహించాలనే ఈ చెల్లింపులు జరిగాయని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌తో హైదరాబాద్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.700 కోట్ల లాభం వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం FEOకు మిగతా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిందని అన్నారు. 2023 అక్టోబర్‌లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే FEOకు చెల్లించారని చెప్పారు.
ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రాథమిక విచారణ జరిపి తాత్కాలిక ఊరటనిచ్చింది. ఈ-కార్ రేసు అంశంలో ఎలాంటి అక్రమాలు చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును ఉద్దేశపూర్వకంగా తనపై కేసు పెట్టారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టు తాత్కాలిక ఆదేశాలతో కేటీఆర్‌కు కొంతమేర ఉపశమనం లభించింది.
Read Also : 2027 National Olympics: “ఖేలో ఆంధ్రప్రదేశ్” గా ఏపీ…