Bhatti Vikramarka : బీఆర్‌ఎస్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్
Bhatti Vikramarka : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధమంటూ సవాల్ విసిరారు.
- By Kavya Krishna Published Date - 05:11 PM, Sun - 15 December 24

Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీలో లెక్కలపై చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పిల్లలకు పోషక ఆహారం అందించడంలో ప్రభుత్వం నిబద్ధంగా ఉందని, పెంచిన డైట్ ఛార్జీల వల్ల కొంత భారం వచ్చినప్పటికీ, ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
2014 నాటికి రాష్ట్రం 72,450 కోట్ల అప్పుల్లో ఉందని, రాష్ట్ర విభజన సమయంలో 5,893 కోట్ల అప్పు ఉన్నప్పటికీ, పదేళ్లలో అది 7,23,000 కోట్లకు పెరిగిందని తెలిపారు. ‘‘మీరు అప్పులు తినేందుకు చేసారు, కానీ మేము వాటిని చెల్లించేందుకు చేసాం,’’ అని భట్టి మండిపడ్డారు. 2014 నాటికి రాష్ట్రం సంవత్సరానికి 6,400 కోట్ల వడ్డీ కడుతుండగా, ప్రస్తుతం ఆ బారం మరింత పెరిగిందని అన్నారు. ‘‘10 ఏళ్ల పాలనలో మీరు ధరలకు తగ్గట్టుగా రేట్లు పెంచకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అన్నంలో పురుగులు వచ్చాయనే ఆరోపణలు చేస్తూ మీ వైఫల్యాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూల్లలో టాయిలెట్లు సరిగా లేవని మాట్లాడుతున్నారు, కానీ మీరు 10 ఏళ్లు అధికారంలో ఉన్నారే కదా?’’ అని భట్టి ప్రశ్నించారు.
‘‘మా ప్రభుత్వం ప్రారంభం నుంచి 66,722 కోట్ల అప్పులు చెల్లించాం. ఏడాదిలోనే 21 వేల కోట్ల రుణమాఫీ చేసాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని కోట్ల రూపాయల రైతు అప్పు మాఫీ చేయలేదు. రైతు భరోసా పథకంలో 7,625 కోట్ల రూపాయలు విడుదల చేసి, రైతు బీమా కట్టించాం. రైతుల సంక్షేమం కోసం నేరుగా ఖర్చు పెట్టాం,’’ అని వివరించారు.
‘‘బీఆర్‌ఎస్ గత 10 ఏళ్లలో పంట నష్టపోయిన రైతులను పట్టించుకోలేదు. నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందించడంతో పాటు, 22 వేల కోట్ల బడ్జెట్‌తో 3,500 ఇళ్ల నిర్మాణం చేపట్టాం. రైతుల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు ప్రచురిస్తే ప్రజలు నమ్మలేరు,’’ అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
భూమిలేని నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తుందని, డిసెంబర్ 28న మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ అందజేస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వెనకడుగు వేయదని హామీ ఇచ్చారు.
Read Also : CM Chandrababu : తెలుగు జాతి కోసం రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు