Bathukamma: కనివినీ ఎరుగని రీతిలో బతుకమ్మ సంబరాలు!
ఈ వేడుకలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కోరారు. ముఖ్యమైన జంక్షన్లు, టూరిజం హోటళ్లు, రైల్వే, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాలలో సాంప్రదాయ బతుకమ్మ ప్రతిమలు నెలకొల్పాలని సూచించారు.
- By Gopichand Published Date - 07:55 PM, Tue - 16 September 25

Bathukamma: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ (Bathukamma) ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. సంప్రదాయాన్ని, ఆధునికతను మేళవించి ఈసారి బతుకమ్మ సంబరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నారు.
వైభవంగా బతుకమ్మ వేడుకలు
ఈ సంవత్సరం బతుకమ్మ వేడుకలను సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామాలతో పాటు హైదరాబాద్‌లోనూ ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక, చారిత్రక ప్రాంతాలను ముస్తాబు చేయాలని, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Also Read: Super 4 Contest: ఉత్కంఠభరితంగా ఆసియా కప్.. టేబుల్ టాపర్స్ ఎవరంటే?
ప్రత్యేక ఆకర్షణలు, కార్యక్రమాలు
బతుకమ్మపై ప్రత్యేక గీతాలు, సంస్కృతి, ప్రకృతి, పర్యావరణం థీమ్‌తో కూడిన డిజైన్‌లను రూపొందించాలని మంత్రి కోరారు. వీటిని ప్రతి ఒక్కరూ తమ కాలర్ ట్యూన్‌లు, సోషల్ మీడియా స్టేటస్‌లుగా పెట్టుకోవాలని సూచించారు. ఉత్సవాల అనంతరం పూలు, ఇతర సామాగ్రిని వృధాగా పారబోయకుండా వాటితో పర్యావరణహిత వస్తువులు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వేడుకలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కోరారు. ముఖ్యమైన జంక్షన్లు, టూరిజం హోటళ్లు, రైల్వే, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాలలో సాంప్రదాయ బతుకమ్మ ప్రతిమలు నెలకొల్పాలని సూచించారు. విద్యార్థులంతా ఉత్సవాల్లో పాల్గొనేలా కళాశాల, యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాన కార్యక్రమాల షెడ్యూల్
- సెప్టెంబర్ 21: వరంగల్‌లోని చారిత్రాత్మక వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ ప్రారంభోత్సవం. ఉదయం హైదరాబాద్ శివార్లలో మొక్కలు నాటడం.
- సెప్టెంబర్ 22: శిల్పారామం, హైదరాబాద్; పిల్లలమర్రి, మహబూబ్‌నగర్.
- సెప్టెంబర్ 23: బుద్ధవనం, నాగార్జునసాగర్, నల్గొండ.
- సెప్టెంబర్ 24: కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, భూపాలపల్లి; సిటీ సెంటర్, కరీంనగర్.
- సెప్టెంబర్ 25: భద్రాచలం ఆలయం-కొత్తగూడెం, ఖమ్మం; జోగులాంబ అలంపూర్, గద్వాల; స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్ – బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ (25/09/2025 నుంచి 29/09/2025 వరకు).
- సెప్టెంబర్ 26: అలీ సాగర్ రిజర్వాయర్, నిజామాబాద్; ఆదిలాబాద్, మెదక్; నెక్లెస్ రోడ్, హైదరాబాద్ – సైకిల్ ర్యాలీ (ఉదయం).
- సెప్టెంబర్ 27: మహిళల బైక్ ర్యాలీ – నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, హైదరాబాద్ (ఉదయం); ఐటీ కారిడార్, హైదరాబాద్- బతుకమ్మ కార్నివాల్ (సాయంత్రం).
- సెప్టెంబర్ 28: ఎల్.బి. స్టేడియం, హైదరాబాద్- గిన్నీస్ వరల్డ్ రికార్డ్ (10,000కి పైగా మహిళలతో 50 అడుగుల బతుకమ్మ).
- సెప్టెంబర్ 29: పీపుల్స్ ప్లాజా, హైదరాబాద్- ఉత్తమ బతుకమ్మ పోటీలు, సరస్ ఫెయిర్.
- సెప్టెంబర్ 30: ట్యాంక్‌బండ్- గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కారు ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ఫ్లోట్స్, ఇకెబానా ప్రదర్శన, సెక్రటేరియట్‌పై 3డీ మ్యాప్ లేజర్ షో.