Cabinet Expansion: ఉగాదికల్లా మంత్రివర్గ విస్తరణ.. కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ
మంత్రి పదవులను ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Cabinet Expansion) ఇవాళ రాత్రి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.
- By Pasha Published Date - 09:11 PM, Mon - 24 March 25

Cabinet Expansion: ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో హస్తం పార్టీ అగ్రనేతలతో.. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇవాళ సాయంత్రం భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు, మంత్రి మండలి విస్తరణపై ఈసందర్భంగా చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాక, ఉగాది (మార్చి 30) నాటికి మంత్రివర్గ విస్తరణ పూర్తవుతుందని తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులను భర్తీ చేయనున్నారు. ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఉచిత హామీల అమలుపైనా ఈ సమావేశంలో డిస్కషన్ జరగనుంది. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నవాటిని అమలు చేయడంపై ఫోకస్ పెట్టాలని రేవంత్ అండ్ టీమ్‌కు కాంగ్రెస్ పెద్దలు సూచించే అవకాశం ఉంది.
ఇవాళ రాత్రి..
మంత్రి పదవులను ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Cabinet Expansion) ఇవాళ రాత్రి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇటీవలే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారని అంటున్నారు.
Also Read :Night Safari : దేశంలోనే తొలి నైట్ సఫారీ.. ఎలా ఉంటుందో తెలుసా ?
మంత్రి పదవుల రేసులో వీరే..
రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి తెలంగాణ మంత్రిమండలిలో ఇప్పటివరకు ఎవరికీ చోటు దక్కలేదు. ఆయా జిల్లాల నుంచి వివిధ సామాజిక వర్గాల నేతలంతా మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ సాగర్ రావు, ఎమ్మెల్యే వివేక్ పేర్లు వినిపిస్తున్నాయి. వాకాటి శ్రీహరి ముదిరాజ్ మంత్రి పదవికి ట్రై చేస్తున్నారు. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే, మంత్రిమండలిలో బెర్త్ కేటాయిస్తామని పార్టీ పెద్దలు తనకు హామీ ఇచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. తనకు మంత్రి పదవి ఖాయమని రాజగోపాల్ రెడ్డి గతంలో పలుమార్లు ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.