Night Safari : దేశంలోనే తొలి నైట్ సఫారీ.. ఎలా ఉంటుందో తెలుసా ?
నైట్ సఫారీ(Night Safari)లో రాత్రి టైంలో ప్రత్యేకంగా రూపొందించిన లైటింగ్ వ్యవస్థలు ఉంటాయి. పర్యావరణహితమైన ఈవీ వాహనాలను సఫారీలో నడుపుతారు.
- By Pasha Published Date - 08:26 PM, Mon - 24 March 25

Night Safari : మన దేశంలోనే తొలిసారిగా నైట్ సఫారీ అందుబాటులోకి రాబోతోంది. అది వచ్చాక.. రాత్రి టైంలో మనం సఫారీకి వెళ్లొచ్చు. వన్యప్రాణులను అత్యంత సమీపం నుంచి చూడొచ్చు. ‘కుక్రైల్ నైట్ సఫారీ, అడ్వెంచర్ పార్క్’ (Kukrail Night Safari) పేరిట నైట్ సఫారీని అందుబాటులోకి తెచ్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రఖ్యాత ‘సింగపూర్ నైట్ సఫారీ’ స్ఫూర్తితో రూ.1500 కోట్లతో 850 ఎకరాల్లో రెండు దశల్లో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన పనులు ఏప్రిల్ నెలలో ప్రారంభం కాబోతున్నాయి.
Also Read :Vijays Last Film: విజయ్ లాస్ట్ మూవీ.. ‘జన నాయగన్’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ
నైట్ సఫారీ విశేషాలివీ..
- ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కుక్రైల్ రక్షిత అటవీ ప్రాంతం సమీపంలో నైట్ సఫారీని అభివృద్ధి చేస్తారు.
- ఈ అటవీ ప్రాంతంలో వివిధ రకాల వృక్షజాతులు, జీవజాతులు ఉన్నాయి.
- నైట్ సఫారీ తొలి దశ పనుల అంచనా వ్యయం రూ.631 కోట్లు. ఇందులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, ఎన్‌క్లోజర్ల ఏర్పాటు, పర్యాటకులకు సౌకర్యాలపై ఫోకస్ పెడతారు. 24 నెలల్లో పనులు పూర్తవుతాయి.
- నైట్ సఫారీ(Night Safari)లో రాత్రి టైంలో ప్రత్యేకంగా రూపొందించిన లైటింగ్ వ్యవస్థలు ఉంటాయి. పర్యావరణహితమైన ఈవీ వాహనాలను సఫారీలో నడుపుతారు.
- ఈ సఫారీలో పక్షి ప్రేమికుల కోసం ప్రత్యేక విభాగాలు ఉంటాయి.
- వన్యప్రాణుల సంరక్షణ గురించి అవగాహన కల్పించేందుకు ఇందులో సమాచార కేంద్రాలు ఉంటాయి.
- ట్రామ్ సర్వీసు ఉంటుంది.
- సింహాలు, చిరుతలు, కృష్ణ జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, హైనా తదితర జంతువులు, వివిధ రకాల పక్షులు, సరీసృపాల కోసం 38 ఎన్‌క్లోజర్లను ఈ సఫారీలో ఏర్పాటు చేస్తారు.
- ఈ సఫారీలో ఆర్ట్ గ్యాలరీ, వెటర్నరీ హాస్పిటల్, 7డీ థియేటర్ ఉంటాయి.
- సాహస క్రీడల కోసం ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేస్తారు.
- యూపీలో పర్యాటక రంగం వికాసానికి ఈ నైట్ సఫారీ దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు.