Telangana AI Revolution : హైదరాబాద్‌లో ఏఐ సిటీ.. తెలంగాణలో ఏఐ విప్లవం.. రేవంత్ సర్కారు అడుగులు
తెలంగాణ ఏఐ (Telangana AI Revolution) ప్రణాళికలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.
- By Dinesh Akula Published Date - 03:41 PM, Thu - 19 December 24

Dinesh Akula
ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీలో భారతదేశ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రపంచ స్థాయి ఏఐ పరిశోధనలు, అభివృద్ధికి కేంద్రంగా మారనుంది. ఏఐ సిటీలో అత్యాధునిక సౌకర్యాలు, డేటా లేక్స్, డిజిటల్ కనెక్టివిటీతో మల్టీనేషనల్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లు పనిచేయొచ్చు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఎన్‌విడియా, ఏడబ్ల్యూఎస్ వంటి సంస్థలతో తెలంగాణ సర్కారు 26 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధన, విద్యా రంగం వంటి విభాగాల్లో తెలంగాణ రాష్ట్రానికి దోహదం చేసేలా ఈ ఒప్పందాలు జరిగాయి.
Also Read :Innocent Victims : అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్.. నలుగురు పిల్లలకు గాయాలు.. బాలిక మెడలోకి బుల్లెట్
విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత
తెలంగాణ ఏఐ (Telangana AI Revolution) ప్రణాళికలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని పాఠశాలల్లో ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టనున్నారు. 2027 నాటికి 20వేల మంది ఉపాధ్యాయులకు ఈ పాఠ్యాంశాలపై శిక్షణ పూర్తవుతుంది. ఆ ఉపాధ్యాయుల ద్వారా 5000 పాఠశాలల్లో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఏఐ పాఠ్యాంశాలు అందుతాయి. తద్వారా తెలంగాణ భావితరాలు, యువతలో ఏఐ నైపుణ్యాలు పెరుగుతాయి. ఈ ఫలితాలను సాధించడం ద్వారా టెక్నాలజీకి, ఉద్యోగ అవకాశాలకు మధ్య ఏర్పడిన గ్యాప్‌ను తుడిచి వేయాలనే గొప్ప సంకల్పంతో రేవంత్ సర్కారు ముందుకు సాగుతోంది.
2027 నాటికి ఏఐ రంగంలో 5 లక్షల మంది నిపుణులను తయారు చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అమలు చేయనుంది. స్టార్టప్స్‌కు అధిక నాణ్యత గల డేటాను అందించేందుకు తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫాం (TGDex) ను ప్రారంభించనున్నారు. డేటా అనోటేషన్ హబ్‌లు కూడా ఏర్పాటు చేసి, తెలంగాణను ఏఐ విప్లవంలో ముందుకు తీసుకెళ్లనున్నారు.
తెలంగాణ ప్రభుత్వంలోని ఒక అధికారి మాట్లాడుతూ.. “తెలంగాణ కేవలం ఏఐ విప్లవంలో భాగం కావడంతో పాటు దానికి సంబంధించిన ఆవిష్కరణలకు సారథ్యం వహిస్తోంది. ఈ వ్యూహం ద్వారా మనం నైతికత, సాంకేతికతకు సమతుల్యాన్ని అందించగలమన్న నమ్మకం ఉంది’’ అని తెలిపారు.
Also Read :US Vs Pakistan : పాక్‌కు షాక్.. ఆ నాలుగు కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. ఎందుకు ?
శంషాబాద్‌లో 2 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్
వరల్డ్ ట్రేడ్ సెంటర్ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఏఐ సిటీ నిర్మాణం జరిగేలోగా.. ఏఐ రంగ సంబంధిత కంపెనీలు తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు శంషాబాద్‌లో వాటికి 2 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్‌ను తెలంగాణ సర్కారు అందిస్తోంది. ఏఐ రంగంలో మౌలిక సదుపాయాలు, పరిశోధన, ఉపాధి అవకాశాలు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించనున్నాయి.
తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏఐ రంగ వ్యూహాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ చేసుకుంది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “భారతదేశం గత పారిశ్రామిక విప్లవాలను కోల్పోయినా.. ఏఐ విప్లవానికి తెలంగాణ నాయకత్వం వహించి సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది. ఏఐ రంగంలో కొత్త శకం ప్రారంభానికి హైదరాబాద్ వేదికగా నిలవబోతుంది’’ అని ఆయన వెల్లడించారు. ఏఐ రంగంపై తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న విజన్ రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, సాంకేతిక ఆధునికతను తీసుకొని, ఏఐ కేంద్రంగా హైదరాబాద్‌కు స్థానాన్ని సాధించి పెడుతుంది.
Hyderabad set to become an Artificial Intelligence AI hub in India
Congress government led by Chief Minister A. Revanth Reddy gives top priority to AI city
HyderabadRising
TelanganaRising pic.twitter.com/YHtFE2W2vj— Sriram Karri (@oratorgreat) December 19, 2024