Innocent Victims : అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్.. నలుగురు పిల్లలకు గాయాలు.. బాలిక మెడలోకి బుల్లెట్
బాధిత బాలికకు(Innocent Victims) ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఒక ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోందని తెలుస్తోంది.
- By Pasha Published Date - 01:43 PM, Thu - 19 December 24

Innocent Victims : ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ పరిధిలో ఉన్న కల్హాజా – దోండార్ బేడా ఏరియాలో ఈనెల 12న జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన ఒక విషాదకర విషయం బయటికి వచ్చింది. ఆ ఎన్‌కౌంటర్ వేళ నలుగురు పిల్లలకు కూడా గాయాలైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 16 ఏళ్ల బాలిక మెడలోకి బుల్లెట్ తీసుకెళ్లిందని తెలిసింది. గత వారం రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని సమాచారం. ఆమె మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని నిరూపించే ఎక్స్‌రే స్కానింగ్ రిపోర్టులు ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధిత బాలికకు(Innocent Victims) ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఒక ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోందని తెలుస్తోంది.
Also Read :US Vs Pakistan : పాక్‌కు షాక్.. ఆ నాలుగు కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. ఎందుకు ?
ఈ ఎన్‌కౌంటర్ వేళ నాలుగేళ్ల బాలుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అతడి తల భాగాన్ని తాకుకుంటూ బుల్లెట్ ముందుకు దూసుకెళ్లినట్లు తెలిసింది. బుల్లెట్ వేగంగా దూసుకెళ్లే క్రమంలో తాకడంతో.. ఆ బాలుడి తలకు బలమైన గాయమైందని వెల్లడైంది. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఒక వ్యక్తి కుమారుడు(14 ఏళ్ల వయసు) మీడియాతో మాట్లాడుతూ.. తనకు కూడా బుల్లెట్ గాయమైందన్నాడు. ఈ ఎన్‌కౌంటర్ సందర్భంగా అయిన తీవ్ర గాయం వల్ల మరో బాలుడి(17 ఏళ్ల వయసు) చేతి నుంచి మాంసపు ముద్ద ఊడిపడిందని తెలిసింది. డిసెంబరు 12న ఎన్‌కౌంటర్ జరుగుతున్న టైంలో సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న పలువురు గ్రామస్తులకు కూడా గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఏడుగురిలో ఐదుగురు అమాయక గ్రామస్తులే అని మావోయిస్టులు వాదిస్తున్నారు. దీనిపై పోలీసుల వాదన మరోలా ఉంది. పిల్లలు, గ్రామస్తులను మానవ కవచంలా మావోయిస్టులు వాడుకుంటున్నారని.. అందుకే ఇదంతా జరిగిందని ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కార్తీక్ అనే సీనియర్ మావోయిస్టు నేతను కాపాడేందుకు పిల్లలు, గ్రామస్తులను కవచంలా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.