సీఎం రేవంత్ నాయకత్వానికి బ్రహ్మరథం!
"పల్లెల్లో కేసీఆర్ హవా ఉంది.. ఎన్నికలు పెడితే చూపిస్తాం" అన్న బీఆర్ఎస్ సవాల్‌ను రేవంత్ సర్కార్ పటాపంచలు చేసింది. మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది.
- Author : Gopichand
Date : 18-12-2025 - 2:57 IST
Published By : Hashtagu Telugu Desk
CM Revanth Leadership: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గత కొద్ది రోజులుగా జరిగిన వరుస ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనకు ‘ఫస్ట్ క్లాస్’ మార్కులు వేశాయి. అటు నగరం నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుండి, ఇటు రాష్ట్రవ్యాప్త గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి తన సత్తా చాటింది.
జూబ్లీహిల్స్ వార్.. రేవంత్ మార్క్ విజయం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలనపై రెఫరెండంగా ప్రకటించింది. దీనిని సవాల్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని నడిపించి, ప్రజలతో మమేకమయ్యారు. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఏకంగా 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి, ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ తెలంగాణ ప్రజలు రేవంత్ వెంటే ఉన్నారని ఈ తీర్పుతో స్పష్టమైంది.
పల్లెల్లో మారిన సమీకరణాలు.. ‘చేతి’ వశమైన పంచాయతీలు
“పల్లెల్లో కేసీఆర్ హవా ఉంది.. ఎన్నికలు పెడితే చూపిస్తాం” అన్న బీఆర్ఎస్ సవాల్‌ను రేవంత్ సర్కార్ పటాపంచలు చేసింది. మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. గ్లోబల్ సమ్మిట్ విజయం, ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ పర్యటన వంటి అంతర్జాతీయ ఈవెంట్లతో జోష్ మీద ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు గ్రామీణ ఓటర్ల మనసు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది.
Also Read: ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
విజయానికి బాటలు వేసిన ‘రేవంత్ బ్రాండ్’ పథకాలు
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఈ విజయానికి వెన్నెముకగా నిలిచాయి.
సన్నబియ్యం పథకం: 3.10 కోట్ల మందికి నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేయడం పేదవాడి ఆత్మగౌరవంగా నిలిచింది. రేషన్ బియ్యంపై ఉన్న పాత అపోహలను ఈ పథకం తొలగించింది.
ఇందిరమ్మ ఇళ్లు: రూ. 22 వేల కోట్లతో నిర్మిస్తున్న 4.5 లక్షల ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు భరోసానిచ్చాయి.
రైతులకు బోనస్: సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాకు రూ. 500 బోనస్ ఇవ్వడం రైతాంగంలో సానుకూలత తెచ్చింది.
మహాలక్ష్మి & గృహజ్యోతి: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు మహిళా ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పాయి.
రైతు రుణమాఫీ: భారీ స్థాయిలో చేపట్టిన రుణమాఫీ కార్యక్రమం గ్రామాల్లో కాంగ్రెస్ పట్టును మరింత బిగించింది.
చివరగా.. అర్బన్, రూరల్ అనే తేడా లేకుండా తెలంగాణ అంతటా ఇప్పుడు కాంగ్రెస్ గాలి బలంగా వీస్తోంది. ప్రతిపక్షాల విమర్శలను తన పనితీరుతోనే తిప్పికొట్టిన రేవంత్ రెడ్డి, ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తన నాయకత్వాన్ని మరోసారి సుస్థిరం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా పాలనను మరింత వేగవంతం చేసే దిశగా ఈ గెలుపు రేవంత్ సర్కార్‌కు కొండంత అండగా నిలిచింది.