CS Shanti Kumari: రాష్ట్రంలో 29 వరద ప్రభావిత జిల్లాలు: సీఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, వికాస్ రాజ్ లతోపాటు పలువురు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
- Author : Gopichand
Date : 07-09-2024 - 7:51 IST
Published By : Hashtagu Telugu Desk
CS Shanti Kumari: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వలన 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) తెలిపారు. ఇప్పటికే నాలుగు జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించి వెంటనే తగు సహాయ పునరావాస చర్యలు చేపట్టేందుకు నిధులను సంబంధిత జిల్లా కలెక్టర్లకు విడుదల చేయడం జరిగిందని, అదేవిధంగా మిగిలిన 25 జిల్లాలకు మూడు కోట్ల రూపాయల చొప్పున సంబంధిత జిల్లా కలెక్టర్లకు నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై సవివర నివేదికను సోమవారం మధ్యాహ్నంలోగా సమర్పించాలని కోరుతూ శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్లతో సి.ఎస్. టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, వికాస్ రాజ్ లతోపాటు పలువురు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీల మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల నమోదైన వర్షపాతం ఆధారంగా ఈ 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటించినట్టు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల మినహా అన్ని జిల్లాలను వర్ష ప్రభావిత జిల్లాలుగా ప్రకటించినట్టు వివరించారు. ఈ జిల్లాలకు వెంటనే తగు తక్షణ పునరావాస చర్యలను చేపట్టేందుకు జిల్లాకు మూడు కోట్ల రూపాయలను విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని శాంతి కుమారి తెలిపారు.
Also Read: Central Govt Releases Rs. 3300 Cr : కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాలేదు – CM చంద్రబాబు
SDRF నియమ నిబంధనలను అనుసరించి ఈ నిధులను వ్యయం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై, చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు, అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన సోమవారం నాడు ఉన్నతస్థాయి సమావేశాన్నిఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వరదలు వర్షాల జరిగిన నష్టాల వివరాలను నిర్ణీత నమూనాలో సమర్పించేందుకుగాను జిల్లాల వారీగా సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 29 మంది మరణించారని వీరికి ఎక్స్ గ్రేషియా అందించేందుకు వివరాలు పంపాలని తెలిపారు.
జిల్లాల వారీగా జరిగిన పంట నష్టం, పాడి పశువుల మరణాలు, ఇతర వ్యవసాయ సంబంధిత నష్టాల వివరాలతో పాటు దెబ్బతిన్న రాష్ట్ర, జిల్లా, పంచాయతీ రహదారుల వివరాలు, దెబ్బతిన్న కల్వర్టులు బ్రిడ్జిలు, పాఠశాల భవనాలు, తాగునీటి సరఫరా పైప్ లైన్ ల వివరాలతో కూడిన నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.