Ravi Shastri: ఆ బంతులు ఆ బాక్స్‌లో ఏం చేస్తున్నాయి.. రవిశాస్త్రి కామెంట్స్ వైరల్!
ఈ సిరీస్‌లో డ్యూక్ బాల్ రెండు జట్లకూ పెద్ద సమస్యగా మారింది. బంతి త్వరగా తన ఆకారాన్ని కోల్పోతోంది. దీంతో బౌలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సార్లు 10 ఓవర్ల తర్వాత కూడా కొత్త బంతిని మార్చాల్సి వస్తోంది.
- By Gopichand Published Date - 08:50 PM, Sat - 12 July 25

Ravi Shastri: భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో ఆటగాళ్ల కంటే డ్యూక్ బాల్ వివాదాల్లో ఎక్కువగా చిక్కుకుంది. మొదటి మ్యాచ్‌లోనే బాల్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఎందుకంటే బంతి ఆకారం నిరంతరం దెబ్బతింటోంది. దీంతో ఆటగాళ్లు బంతిని అనేక సార్లు అంపైర్ల వద్దకు తీసుకెళ్లడం కనిపించింది. లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ సమయంలో టీమ్ ఇండియా బౌలర్లు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అంపైర్‌తో దీని గురించి చాలా సేపు వాదించారు. ఆ తర్వాత ఇంగ్లీష్ జట్టు బౌలర్లు కూడా బంతి ఆకారం గురించి పదేపదే అంపైర్ వద్దకు వెళ్లారు. దీని గురించి కామెంటరీలో టీమ్ ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి (Ravi Shastri) అంపైర్లను తీవ్రంగా మందలించారు.
బాల్స్ గురించి రవి శాస్త్రి ఏమన్నారు?
భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లీష్ జట్టు బంతి గురించి అంపైర్లకు ఆందోళన వ్యక్తం చేసి, దానిని మార్చమని కోరింది. ఆ తర్వాత అంపైర్ బంతిని రింగ్‌లో వేసి తనిఖీ చేశాడు. బంతిని మార్చాలని నిర్ణయించాడు. బయట నుండి ఒక బాక్స్‌ను అంపైర్ల వద్దకు తీసుకొచ్చారు. దానిలో అనేక బంతులు ఉన్నాయి. అంపైర్ ఆ బంతుల నుండి ఒక బంతిని ఎంచుకునేందుకు ప్రయత్నించినప్పుడు.. వారు ఒక్కొక్కటిగా 5 బంతులను రింగ్ ద్వారా పంపేందుకు ప్రయత్నించారు. కానీ ఒక్క బంతి కూడా రింగ్‌ను దాటలేకపోయింది. దీని అర్థం ఆ బంతులన్నీ ఆకారంలో లోపభూయిష్టంగా ఉన్నాయి.
Also Read: KL Rahul: 100 కొట్టి ఔటైన కేఎల్ రాహుల్.. సచిన్ రికార్డు సమం!
Ravi Shastri – "They checked 5 balls and that didn't go inside the ring so why are they in the box". 😂🔥 pic.twitter.com/SQF7NBBy5X
— Johns. (@CricCrazyJohns) July 12, 2025
ఈ సందర్భంలో కామెంటరీ చేస్తున్న టీమ్ ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి దీని గురించి ఆందోళన వ్యక్తం చేశారు. “వారు 5 బంతులను తనిఖీ చేశారు. వాటిలో ఒక్కటి కూడా రింగ్‌ను దాటలేదు. అలాంటప్పుడు ఆ బంతులన్నీ ఆ బాక్స్‌లో ఏం చేస్తున్నాయి?” అని ప్రశ్నించారు.
డ్యూక్ బాల్ రెండు జట్లకూ సమస్యగా మారింది
ఈ సిరీస్‌లో డ్యూక్ బాల్ రెండు జట్లకూ పెద్ద సమస్యగా మారింది. బంతి త్వరగా తన ఆకారాన్ని కోల్పోతోంది. దీంతో బౌలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సార్లు 10 ఓవర్ల తర్వాత కూడా కొత్త బంతిని మార్చాల్సి వస్తోంది. క్రికెట్‌లోని అనేక దిగ్గజాలు ఈ బంతిని విమర్శిస్తూ వస్తున్నారు. ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 2020 నుండి డ్యూక్ బాల్‌ను విమర్శిస్తూ వస్తున్నాడు. కొత్త బంతి ఎక్కువ సేపు గట్టిగా ఉండలేకపోతోంది. త్వరగా సాఫ్ట్ అవుతోంది. దీని గురించి భవిష్యత్తులో ఏమి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.