Virat Kohli 100th T20:అరుదైన రికార్డు ముంగిట కోహ్లీ
భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత రికార్డుల రారాజు కోహ్లీనే... గత కొన్నేళ్ళుగా రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాడు. ఫార్మేట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించిన విరాట్ ఇప్పుడు పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు.
- By Naresh Kumar Published Date - 05:56 PM, Thu - 25 August 22

భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత రికార్డుల రారాజు కోహ్లీనే… గత కొన్నేళ్ళుగా రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాడు. ఫార్మేట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించిన విరాట్ ఇప్పుడు పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. ఆసియాకప్ తోనైనా కోహ్లీ ఫామ్ లోకి వస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తో మ్యాచ్ ద్వారా కోహ్లీ అరుదైన ఘనత సాధించనున్నాడు. ఈ మ్యాచ్ తో అంతర్డాతీయ టీ ట్వంటీ కెరీర్ లో సెంచరీ పూర్తి చేసుకోబోతున్నాడు.
భారత జట్టు తరుపున ఇప్పటికే రోహిత్ శర్మ 132 టీ ట్వంటీ మ్యాచులు ఆడి టాప్‌లో ఉన్నాడు. అయితే మూడు ఫార్మాట్లలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా విరాట్ నిలవబోతున్నాడు. టీమిండియా తరుపున 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20 మ్యాచులు ఆడిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ రికార్డును చేజార్చుకున్నాడు. ఇక టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ 132 టీ ట్వంటీలు, 233 వన్డేలు ఆడినప్పటకీ టెస్టుల్లో మాత్రం చాలా దూరంలో నిలిచిపోయాడు. కెరీర్ లో ఇప్పటి వరకూ హిట్ మ్యాన్ 45 టెస్టులు మాత్రమే ఆడాడు. ఓవరాల్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ ఒక్కడే మూడు ఫార్మాట్లలో 100కి పైగా మ్యాచులు ఆడాడు.. 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20 మ్యాచులు ఆడిన రాస్ టేలర్, గత ఏడాది చివరన అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం వన్డే, టీ ట్వంటీ, టెస్ట్ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ 100కి పైగా మ్యాచ్ లు ఆడిన ఏకైక ప్లేయర్ గా నిలవబోతున్నాడు.